రామోజీరావుకు నో రూల్స్... ఉండవల్లి సంచలన కామెంట్స్
మీడియా దిగ్గజం రామోజీరావు మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
మీడియా దిగ్గజం రామోజీరావు మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలలో చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నా కూడా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అని అన్నారు. అందరికీ చట్టాలు కానీ రామోజీరావు విషయంలో మాత్రం ఎవరూ ఏమీ చేయలేని స్థితిని చూస్తున్నామని అన్నారు.
ఆయనకు నో రూల్స్ అని హాట్ కామెంట్స్ చేశారు. రామోజీరావు హైదరాబాద్ శివార్లలో ఫిల్మ్ సిటీ కోసం కొనుగోలు చేసిన భూములు అన్నీ ల్యాండ్ సీలింగ్ చట్టానికి వ్యతిరేకమైనా కూడా ఈ రోజుకీ ఆయన ఒక్క ఎకరం కూడా ప్రభుత్వానికి అప్పగించలేదని ఉండవల్లి ఆరొపైంచారు. రెండు వేల ఎకరాల భూమి ఫిల్మ్ సిటీ పేరున ఉందని, రామోజీరావు తన కుమారుడు, కోడలు, ఇతర బంధువుల పేరుతో ఆరు యూనిట్లుగా వేలాది ఏకరాల భూమిని కొనుగోలు చేసారని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఈ భూమిలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం చూస్తే 1650 ఎకరాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన అన్నారు. కానీ ఈ రోజుకీ ఏమీ అక్కడ జరగలేదని అన్నారు. ఈ రెండు వేల ఎకరాల భూముల ఆస్తి ఈ రోజు తక్కువలో తక్కువ మార్కెట్ విలువ చూసుకుంటే అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని ఉండవల్లి లెక్క కట్టారు. ఈ కేసు విషయంలో తెలంగాణా ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడకపోవడంతో కేసు లేకుండా పోయిందని అన్న్నారు.
అయితే తాను దీని మీద కోర్టుకు వెళ్తానని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ అన్నీ అవినీతిమయం అని ఉండవల్లి ఫైర్ అయ్యారు. రామోజీరావుకు చిట్ ఫండ్ చట్టాలు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన పలుకుబడితో చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా చట్టాన్ని పరిహాసం చేసేలా ఉన్నాయని అన్నారు.
పెద్ద లాయర్లతో కేసులను వాదిస్తున్నారని ఆఖరుకు న్యాయం కూడా ఆలస్యం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్గదర్శి కేసు విషయంలో 2019లో ఉమ్మడి ఏపీ హై కోర్టు కేసు కొట్టేస్తే తాను దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్లానని అక్కడ నాలుగేళ్లు అయినా ఈ కేసు ఏమీ కదలలేదని అన్నారు. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో అఫిడవిట్ దాఖలు చేసి తనకు అండగా నిలిచిందని ఆయన చెప్పారు.
ఈ కేసులో తెలంగాణా ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ కావాల్సి ఉండగా కేసీయార్ కేసు వేస్తారన్న నమ్మకం అయితే లేదని అన్నారు. తెలంగాణలో కొద్ది నెలలలో ఎన్నికలు వస్తున్నాయని అందువల్ల రామోజీరావు విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా సాహసించదని అన్నారు. ఈ రోజున హైదరాబాద్ సహా అనేక చోట్ల చిట్ ఫండ్ కంపెనీలు అన్నీ కూడా రూల్స్ ని ఫాలో కావడం లేదని అన్నారు. దానికి కారణం అతి పెద్ద చిట్ ఫండ్ సంస్థ మార్గదర్శి కూడా అదే బాటలో ఉండడమే అన్నారు.
ఇక రామోజీరావుకు కోర్టులలో పలుకుబడి చాలా ఉందని ఉండవల్లి అనడం విశేషం. ఆయన లాయర్లు కేసుని ఏ వైపునకు కావాల్సి వస్తే ఆ వైపునకు తిప్పగలరని అన్నారు. రామోజీరావుతో న్యాయ పోరాటం అంటే అన్నీ చాలా జాగ్రత్తగా ఆచీ తూచీ అడుగులు వేయాలని ఏపీ ప్రభుత్వానికి ఉండవల్లి సలహా ఇచ్చారు. ఆషామాషీగా తీసుకోరాదని, ఈ విషయంలో న్యాయపరంగా రామోజీరావు మహా అనుభవశాలి అని ఆయన సెటైర్లు వేశారు.
రామోజీరావుకు సంబంధించి ఆయన నడుపుతున్న పత్రికల పస్తావన ప్రతీ అఫిడవిట్ లో ఏదో విధంగా ఉంటుందని ఉండవల్లి చెప్పారు. ఏ విషయాన్ని అయినా నర్మగర్భంగా రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఉండావల్లి ఎద్దేవా చేసారు. ఇక తనపైన వేసిన పరువు నష్టం దావా కేసులో రామోజీరావు ఎవరో తెలియదు అని రాజాజీ అవిడవిట్ ఫైల్ చేశారని, ఇదే రాజాజీ మరో కేసులో అవిడవిట్ దాఖలు చేస్తూ రామోజీరావు తమ చైర్మన్ అని పేర్కొన్నారని ఉండవల్లి గుర్తు చేస్తూ తప్పు పట్టారు.
ఇదిలా ఉండగా మీడియా సమావేశంలో ఉండవల్లి ఒకింత నిరాశతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఏ చట్టం అయినా రామోజీరావుకు వర్తించదు అని ఒక రూల్ పాస్ చేయమని ప్రభుత్వాలని కోరారు. అపుడు ఎవరూ రామోజీరావు విషయంలో కోర్టుకు వెళ్లే అవకాశమే ఉండదని అన్నారు. ఇదిలా ఉంటే మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసినపుడు ప్రజల దగ్గర ఉండాల్సిన డబ్బు పూర్తిగా వాళ్లదగ్గరే ఉండాలి, కానీ ఆ విధంగా లేదని ఉండవల్లి అంటున్నారు.
ఇక న్యాయ వ్యవస్థ తీరు కూడా మారాల్సిన అవసరం ఉందని, అందరికీ జవాబుదారీగా ఉండడంలేదని ఆయన అన్నారు. మార్గదర్శిలో పూర్తి వాస్తవాలు తాను బయటపెడతాను అని ఈ స్థితిలో తనకు ప్రభుత్వాలు సహకారం అందించాలని ఆయన కోరారు. మార్గదర్శి కేసును లైట్ తీసుకోవద్దని ఆయన జగన్ సర్కార్ ని హెచ్చరించారు. కేసీయార్ రామోజీరావుకు ఎదురు వెళ్లరని, చంద్రబాబుకు రాజ గురువు అంటే భయమని కూడా ఉండవల్లి విమర్శించారు.