పవన్ అమ్మాయిల మిస్సింగ్ ఆరోపణలపై లోక్ సభలో క్లారిటీ!
అవును... 30వేలమంది అమ్మాయిల మిస్సింగ్ అంటూ గత ఏడాది జూలైలో ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ లో సుమారు 30వేల మంది అమ్మాయిలు మాయమయ్యారని.. ఈ మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ లో వైసీపీ నేతల హస్తం ఉందని తెలుస్తోందని.. ఈ మేరకు తనకు కేంద్ర నిఘావర్గాల ద్వారా సమాచారం అందిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏలూరు వారాహి మీటింగ్ లో సంచలన ఆరోపణలు చేశారు. ఆ మహిళల ఉసురు జగన్ పోసుకుంటున్నారని అన్నారు!
ఇదే సమయంలో... 30వేల మంది మహిళలు అదృశ్యమవ్వగా.. అందులో 14వేల మంది ఆచూకీ ఇంకా దొరకలేదని చెప్పారు పవన్ కల్యాణ్. గ్రామాల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు.. ఒంటరి మహిళలు ఎంతమంది.. వితంతువులు ఎవరు.. ఇలాంటి సమాచారమంతా వాలంటీర్ల ద్వారా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని.. తద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై వైసీపీ స్పందించింది.
అవును... 30వేలమంది అమ్మాయిల మిస్సింగ్ అంటూ గత ఏడాది జూలైలో ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై వైసీపీ తాజాగా స్పందించింది. అదంతా పచ్చి అబద్ధం అని చెబుతూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఓ పద్ధతి ప్రకారం బురదజల్లే క్రమంలో ఇలాంటి ఆరోపణలు చేశారని వైసీపీ తెలిపింది.
ఏపీలో బాలికలు, యువతులు అదృశ్యమైపోతున్నారని.. వారంతా అక్రమ రవాణాకు గురవుతున్నారని.. దీనికి వాలంటీర్లే కారణమంటూ ఎన్నికల ముందు పవన్ సహా కూటమి పార్టీలు అమానవీయమైన వ్యాఖ్యలు చేశారని.. అయితే ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తేటతెల్లమైందని చెబుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన వివరణలు వెల్లడించింది.
లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలన్నీ ఉన్నాయని వైసీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా లోక్ సభలో వెల్లడించిన వివరాలను వెల్లడించింది.
ఇందులో భాగంగా... 2019లో బాలికలు/యువతులు కనిపించడంలేదంటూ వచ్చిన ఫిర్యాదులు 6,896 కాగా... ఇందులో ట్రేస్ అయిన వారి సంఖ్య 6,583!
2020లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 7,576 కాగా.. ట్రేస్ చేసిన వారి సంఖ్య 7,189!
2021లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 10,085 కాగా... ట్రేస్ చేసిన వారి సంఖ్య 9,616!
2022లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 10,433 కాగా... ట్రేస్ చేసిన వారి సంఖ్య 10,994 (అంతకు ముందు సంవత్సరాల్లో ట్రేస్ కానివారిని ఈ ఏడాది గుర్తించడంతో ఇక్కడ సంఖ్య పెరిగింది!)
2023లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 9,695 కాగా... ట్రేస్ చేసిన వారి సంఖ్య 9,640!
అని వివరాలు వెల్లడిస్తూ... "దిశ" యాప్ ఉండటం, స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసులు వద్దకు వచ్చి బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారని.. దీంతో ఫిర్యాదుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్టుగా కనిపించినా.. పరిష్కారంలో కూడా అంతే సమర్థత చూపించగలిగారని వైసీపీ వెల్లడించింది.
ఇక, మిస్సింగ్ కేసులను పరిశీలిస్తే... వాటికి పలు కారణాలు ఉంటాయని తెలిపిన వైసీపీ... అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో తప్పడం, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలు తదితర కారణాలు ఉంటాయని వెల్లడించింది. అయితే... ఈ ఘటనలన్నింటినీ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేస్తారని వెల్లడించింది. ఇలాంటి కేసులను రాజకీయంగా వాడుకుని తప్పుడు ప్రచారాలు చేశారని దుయ్యబట్టింది.
ఇదే సమయంలో... చంద్రబాబు గత హయాంలో (2015-18)మధ్య ట్రేస్ కాని, ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య 1,542 మంది ఉన్నారని తెలిపిన వైసీపీ... అంటే వాళ్లంతా అక్రమ రవాణాకు గురైనట్టేనా? అని ప్రశ్నించింది. తప్పుడు ప్రచారాలు చేసిన వారు, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ నిలదీసింది!