నోరు జారిన ఉపేంద్ర... దళిత వర్గాలు ఫైర్!
ఎక్కడైనా కొందరు చెడ్డవాళ్లుంటారు. వారిని ఇగ్నోర్ చేయాలి. ఊరన్నాకా.. దళితుల ఇళ్లు కూడా ఉంటాయి కదా
ఈమధ్యకాలంలో తమదైన ప్రత్యేక జ్ఞానాన్ని పబ్లిక్ లో బయటపెట్టడానికి కొంతమంది సినీ నట్లు అత్యుత్సాహం చూపిస్తున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో మరి ముఖ్యంగా... రాజకీయ లక్ష్యాలు కలిగిన వారు మరింతగా తమ జ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు. తలా తోకా లేకుండా తాను ఏమి చెప్పినా జనం గుడ్డిగా నమ్మేస్తారనే భ్రమంలో బ్రతుకుతున్నారు.
ఈ సమయంలో జనం నుంచి గూబలు ఎరుపెక్కే రియాక్షన్ రావడంతో కొంతమంది మాటమార్చి.. అబ్బే తన మాటల ఉద్దేశ్యం అది కాదని నాలుక కరుచుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారు. మరికొంతమంది మాత్రం బహిరంగంగా సారీ చెబుతున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా కన్నడ నటుడు ఉపేంద్ర చేరారు!
అవును... ఆ మధ్య ఒక రాజకీయ పార్టీ పెట్టి.. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి తనే రాజీనామా చేసి బయటకు వచ్చారు ఉపేంద్ర. అయినా కూడా అప్పుడప్పుడూ ఫేస్ బుక్ లైవ్ లో తన పార్టీ వైఫల్యం గురించి మాట్లాడుతుంటారు. ఎవరినో నిందించే ప్రయత్నం చేస్తుంటారు! ఈ ప్రయత్నంలో తాజాగా ఒక ముతక సామెత వాడారు!
"ఎక్కడైనా కొందరు చెడ్డవాళ్లుంటారు. వారిని ఇగ్నోర్ చేయాలి. ఊరన్నాకా.. దళితుల ఇళ్లు కూడా ఉంటాయి కదా.." ఇదీ ఉపేంద్ర నోటి నుంచి కన్నడలో జాలు వారిన మాటలు! ఒక స్టార్ హీరో, సమాజంపై తెగ ఇదైపోయేలా మాట్లాడే హీరో.. ఇలాంటి అర్ధం పర్ధం లేని ముతక సామెతలు వాడటం ఎంతవరకూ కరెక్ట్? దీంతో... కన్నడనాట దళిత వర్గాలు వైరయ్యాయి.
తన రాజకీయ వైఫల్యానికి, తన చేతకాని తనానికి ఎవరో కొందరు కారణమన్నట్లుగా చెప్పుకునే చాలా మంది నాయకుల్లా.. ఉపేంద్ర కూడా ఇలా మంగళవారం మాటల ప్రయత్నం చేశారు. అలాంటి వారు అంతటా ఉంటారన్నట్టుగా.. చెప్పి దానికి, మధ్యలో ఊరు - దళితుల ఇళ్లు అంటూ ఈ కాలానికి తగని సామెతను చెప్పాడు. ఆ రోజులు పోయాయనే సంగతి తనదైన ప్రత్యేక జ్ఞానంతో మరిచాడు.
దీంతో... దళిత వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. కన్నడ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి! ఉపేంద్ర పోస్టర్లు దగ్దమయ్యాయి! ఆయన ఫోటోలకు చెప్పులు దండలు పడ్డాయి! దీంతో దిగొచ్చాడు ఉపేంద్ర! తను వాడిన సామెత కొందరిని బాధపెట్టిందని.. క్షమాపణలు అని పోస్టు పెట్టాడు.