యూఎస్ సైనికుల కడుపుకొడుతున్నారు.. మిలటరీ.కామ్ షాకింగ్ రిపోర్ట్!
ప్రపంచానికి పెద్దన్న అగ్రరాజ్యం అమెరికా అని.. వారికి ఉన్న మిలటరీ బలం, సైనిక శక్తి అపారమని చెబుతుంటారు.
ప్రపంచానికి పెద్దన్న అగ్రరాజ్యం అమెరికా అని.. వారికి ఉన్న మిలటరీ బలం, సైనిక శక్తి అపారమని చెబుతుంటారు. అయితే.. అంతటి అగ్రరాజ్యంలోని సైనికులు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని.. వారికి నాణ్యమైన ఆహారం దొరకడం లేదనే సంచలన విషయం తాజాగా తెరపైకి వచ్చింది. మిలటరీ.కామ్ ఓ షాకింగ్ రిపోర్ట్ తెరపైకి తెచ్చింది.
అవును... అగ్రరాజ్యం అమెరికాలో సైనికులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని.. సరిగ్గా ఉడకని మాంసం, నాసిరకం కూరగాయలతో భోజనం పెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని మిలటరీ.కామ్ తెరపైకి తీసుకురాగా.. అందుకు కారణం.. వారి నుంచి ఆహారం కోసం సేకరించిన నిధులు దారి మళ్లిస్తుండటమే అని అంటున్నారు.
సాధారణంగా బ్యారక్ లలో ఉంటున్న ప్రతి సైనికుడి జీతం నుంచి ప్రతి నెలా సుమారు 460 డాలర్లు ఆహారం కోసం కట్ చేస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో వారి నుంచి మొత్తం 225 మిలియన్ డాలర్లు సేకరించగా.. వాటిలో కేవలం 74 మిలియన్ డాలర్లు మాత్రమే వారి ఆహారం కోసం వెచ్చించినట్లు నివేదిక వెల్లడించింది.
ఇలా పలు స్థావరాల్లో ఉంటున్న సైనికుల నుంచి ఆహారం కోసమని మొత్తం 225 మిలియన్ డాలర్లు తీసుకోగా.. వాటిలో సుమారు 151 మిలియన్ డాలర్లను ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని.. వారి కోసం మిగిలిన మూడోవంతు మాత్రమే ఖర్చు చేశారని మిలటరీ.కామ్ వెల్లడించింది.
ఇదే సమయంలో... జార్జియాలోని ఫోర్ట్ స్టీవర్ట్ లో సైనికుల నుంచి వారి ఆహారం కోసమని వసూలు చేసింది మొత్తం 17 మిలియన్ డాలర్లు అయితే.. అందులో కేవలం 2.1 మిలియన్లు మాత్రమే వారి కోసం ఖర్చు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే.. వారి ఆహారం కోసం కేటాయించిన నిధుల్లో సుమారు 87శాతం దారి మళ్లించినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ప్రతినిధుల సభ సభ్యుడు జుల్ టోకుడ... సైనికుల ఆహారం కోసం సేకరించిన నిధులను దొంగిలిస్తూ.. సైనిక సంసిద్ధతను సాధించడం సాధ్యం కాదని.. వారి నుంచి సుమారూ 151 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. వారికి సరైన ఆహారం పెట్టడం ఏమాత్రం సరైన చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.