అమెరికా–ఇండియా.. 'పూరీ' బంధం!
అమెరికా ఇంధన వనరుల శాఖ మంత్రి జియోఫ్రే ఆర్ ప్యాట్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు చపాతీలా ఫ్లాట్ గా లేవన్నారు.
చైనా నుంచి ఎదురవుతున్న పోటీ, ముప్పు నేపథ్యంలో అమెరికా గత కొన్నేళ్లుగా భారత్ కు స్నేహ హస్తం చాచుతున్న సంగతి తెలిసిందే. విదేశీ సంబంధాలకు సంబంధించి భారత్ కు అత్యంత ప్రాధాన్యత హోదాను కూడా అమెరికా కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలపై అమెరికా ఇంధన వనరుల శాఖ మంత్రి జియోఫ్రే ఆర్ ప్యాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ – అమెరికా బంధాన్ని భారతీయ వంటకాలైన చపాతీ, పూరీతో పోల్చారు. తద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయో వివరించారు.
విదేశీ వాణిజ్య ఒప్పందంపై చర్చల నిమిత్తం అమెరికా–ఇండియా ప్రతినిధులు తాజాగా వర్చువల్‌గా సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెంపును బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా అమెరికా ఇంధన వనరుల శాఖ మంత్రి జియోఫ్రే ఆర్ ప్యాట్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు చపాతీలా ఫ్లాట్ గా లేవన్నారు. ఈ సంబంధాలు పూరీలాగా మరింత పొంగాయని అభివర్ణించారు.
ప్రస్తుతం భారత్ తో అమెరికా ఎలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడం లేదని మంత్రి ప్యాట్ వెల్లడించారు. అయితే ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలను మరింత ఉన్నత స్థితికి చేర్చుతామన్నారు. ఇందులో భాగంగానే కీలక చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
కాగా భారత్, అమెరికా వాణిజ్య భాగస్వామ్యం గతంలో పోలిస్తే మరింత మరింత పెరిగింది. 2022లో అమెరికా నుంచి భారత్ 47.2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 17.9 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 2012తో పోలిస్తే ఇది 112 శాతం అధికం. ఈ నేపథ్యంలోనే అమెరికా మంత్రి ప్యాట్ భారత్ తో వాణిజ్య సంబంధాలను పొంగిన పూరీతో పోల్చారు.
ఈ వర్చువల్ చర్చల సందర్భంగానే ఇటీవల ఎర్ర సముద్రంలో హౌతీల చేతిలో డ్రోన్ దాడికి గురైన అమెరికా వాణిజ్య నౌకను భారత నౌకాదళం కాపాడిన ఘటనను కూడా ప్యాట్ గుర్తు చేశారు. ఇండియా సామర్థ్యం ఎలాంటిదో ఈ ఘటనే రుజువు చేసిందన్నారు. భారత్ తో బంధం అమెరికాకు ఎంత ప్రయోజనమే చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని ప్యాట్ అభివర్ణించారు.
అంతర్జాతీయంగా సరకు రవాణా వ్యవస్థలో ప్రస్తుతం గందరగోళం ఉందన్నారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు ముప్పు పొంచి ఉండటంతో అవి దారి మార్చుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుందన్నారు.