గ్యాస్ ధర తగ్గింపుపై ఉత్తమ్ ప్రకటన.. ఎంత తగ్గుతుందంటే?
రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో దూసుకుపోతోంది. పార్టీ ఇచ్చిన 6 హామీలను వంద రోజుల్లో అమలు చేయాలనే సంకల్పంతో పని చేస్తుంది.
రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో దూసుకుపోతోంది. పార్టీ ఇచ్చిన 6 హామీలను వంద రోజుల్లో అమలు చేయాలనే సంకల్పంతో పని చేస్తుంది. మొదటగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభించింది. ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా చేపట్టిన ఈ ఉచిత ప్రయాణానికి భారీగా స్పందన లభించింది. ఇక తన తర్వాతి హామీలైన రూ. 500 కే గ్యాస్ సిలిండర్, రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్ తదితరాలపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్న దరిమిలా.. వేగంగా వీటిని అమలు చేయాలని భావిస్తోంది.
గ్యాస్ ధర తగ్గింపు, హామీల అమలుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి విజయవంతం చేశామని, అలాగే ‘ఆరోగ్య శ్రీ’ని రూ. 10 లక్షలకు పెంచామని, ఇక తర్వాత హామీ గ్యాస్ ధర తగ్గించడమే అన్నారు మంత్రి. గ్యాస్ ధరతో పాటు రైతులకు బోనస్ డబ్బులను కూడా వంద రోజుల్లోగానే అమలు చేస్తామన్నారు. గ్యాస్ ధర తగ్గించడం వల్ల ప్రతీ సంవత్సరం ప్రభుత్వంపై రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్ల వరకు మీద పడుతుందని అంచనా వేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
దీంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా శాఖల్లో ఆర్థిక కల్లోలం సృష్టించిందని ఉత్తమ్ ఆరోపించారు. విద్యుత్ లో రూ. 80 వేల కోట్లకు పైగా.. నీటి పారుదల శాఖలో రూ. 10 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి చెప్పుకచ్చారు. పౌర సరఫరాల శాఖను కూడా వారు విడిచిపెట్టలేదన్న మంత్రి రూ. 56 వేల కోట్ల అప్పుల్లో ఉంచారని చెప్పారు. రైతుల నుంచి కార్పొరేషన్ తీసుకున్న 1.17 కోట్ల టన్నుల ధాన్యంలో 87 లక్షల టన్నులకు పైగా మిల్లర్ల వద్దే ఉందని, మిగిలిన 30 లక్షల టన్నుల వరకు
కార్పొరేషన్ మిల్లర్లకు అప్పగించే దశలో ఉందని మంత్రి చెప్పారు.
ఏది ఏమైనా గ్యాస్ ధర తగ్గిస్తామని మంత్రి సూచన ప్రాయంగా చెప్పడంతో తెలంగాణ వ్యాప్తంగా గృహిణుల మొహంలో ఆనందం కనిపిస్తుంది. వంద రోజుల్లోనే ప్రకటన వస్తుందని వారంతా ఆశతో ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు