ఉత్తమ్ ను ర్యాగింగ్ చేస్తున్నారా ?

పీసీసీ మాజీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయం

Update: 2023-07-31 08:07 GMT

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో వ్యవహారాలు విచిత్రంగా ఉంటోంది. సీనియర్ల మధ్య వివాదాలు, గొడవలు ఎప్పుడూ ఉండేవే. ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడటం కూడా మామూలే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మిగిలిన పార్టీల్ల అసమ్మతి రాజకీయాలు వేరు కాంగ్రెస్ లో రాజకీయాలు వేరు. ఎలాగంటే కాంగ్రెస్ లో అసమ్మతి అయినా, వ్యతిరేకత అయినా అంటా ఓపెన్ గానే ఉంటుంది. హస్తంపార్టీలో దాపరికాలంటు ఏమీ ఉండదు.

అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో జరుగుతున్నది మాత్రం వేరుగా ఉంది. ఉత్తమ్ తొందరలోనే పార్టీ మారబోతున్నారంటు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఖండిస్తున్నా ప్రచారం మళ్ళీ మళ్ళీ జరుగుతునే ఉంది. ఉత్తమ్ వ్యవహారం చూస్తుంటే కాలేజీలో కొత్త కుర్రాళ్ళని సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నట్లుగా ఉంది. ఇదే విషయమై ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ గడచిన రెండేళ్ళుగా తనను పార్టీలో ఎవరో వెంటాడుతున్నట్లు మండిపోయారు.

తాను పార్టీ మారబోతున్నట్లు, బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు పార్టీలోని వాళ్ళే ఎవరో కావాలని పదేపదే ప్రచారం చేస్తున్నట్లు మండిపోయారు. తనను ఉద్దేశ్యపూర్వకంగానే ఎవరో టార్గెట్ చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలోని తన పరిస్ధితిని పార్టీలోని పెద్దలకు తాను ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా ఎవరు పట్టించుకోవటంలేదన్నారు. అంటే ఉత్తమ్ సమస్యను పై స్ధాయిలో పట్టించుకోవటంలేదు. రాష్ట్రపార్టీలో వదలకుండా వెంటాడుతున్నారు.

ఇదంతా గమనిస్తుంటే ఉత్తమ్ అంటే పడని నేతలెవరో కావాలనే ఇబ్బందులు పెడుతున్నట్లు అర్ధమవుతోంది. చూస్తుంటే ఆ అదృశ్య ప్రత్యర్ధులు ఎవరో చివరకు ఉత్తమ్ కాంగ్రెస్ ను వదిలేసేంత వరకు విశ్రాంతి తీసుకునేట్లు లేరు. ఉత్తమ్ కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పడటంలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. రేవంత్ కాకుండా ఇంకెంతమందితో ఉత్తమ్ కు శతృత్వం ఉందో తెలీదు. మొత్తానికి పార్టీ సీనియర్లలోని ఉత్తమ్ వ్యతిరేకులెవరో తెరవెనకా ఉండి వ్యవహారమంతా నడుపుతున్నారు. కాకపోతే ఆ వ్యతిరేకులే ఎవరనేది సస్పెన్సుగా మారింది.

Tags:    

Similar News