అనువాదం మెరుగుపడాలి ఉత్తమ్ సారూ..

ఈ నేపథ్యంలో చూస్తే.. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి ప్రాధాన్యం ఇస్తున్నదో తెలిసిపోతుంది.

Update: 2024-04-07 11:20 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన కార్యక్షేత్రంగా ఎంచుకుంది. ఏకంగా ఇక్కడే ప్రజల్లోకి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తుక్కుగూడలో దాదాపు 10 లక్షల మందిలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అందులోనూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్వయంగా సభలో పాల్గొన్నారు. ప్రతిష్ఠాత్మక లోక్ సభ ఎన్నికలకు వివిధ వర్గాలను ఆకట్టుకునేలా అత్యంత పకడ్బందీగా రూపొందించిన మ్యానిఫెస్టోను తుక్కుగూడలోనే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చూస్తే.. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి ప్రాధాన్యం ఇస్తున్నదో తెలిసిపోతుంది.

సూటిగా చెప్పేలా..

మహిళల ఖాతాల్లో రూ.లక్ష, యువతకు ఏడాది అప్రెంటిస్ షిప్, రూ.లక్ష స్టయిఫండ్ వంటి గట్టి హామీలతో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను తీసుకొచ్చింది. వీటిని తుక్కుగూడ సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హిందీ, ఇంగ్లిష్ లో ప్రస్తావించారు. కాగా, ఆయన ప్రసంగానికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనువాదకుడిగా వ్యవహరించారు. రాహుల్ చెబుతున్న పాయింట్లను ప్రజలకు సూటిగా వివరించడంలో మాత్రం ఆయన వందశాతం విజయవంతం కాలేకపోయారనే విమర్శ వచ్చింది. మరీ ముఖ్యంగా పథకాలను వివరించేటప్పుడు ఉత్తమ్ ప్రభావవంతంగా చెప్పలేకపోయారు.

ముందే అధ్యయనం చేస్తే..

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారమే ఢిల్లీలో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ప్రజల్లోకి శనివారం తుక్కుగూడ సభ ద్వారా తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మ్యానిఫెస్టోను ముందే అధ్యయనం చేసి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనువాదం సులభం అయ్యేది. బహుశా సమయాభావం వల్లనో ఏమో కానీ.. అది సాధ్యం కాలేదనిపిస్తోంది.

ముందుముందు చాన్సుంది..

రాహుల్ తెలంగాణలో మరికొన్ని సభల్లోనూ పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఉత్తమ్ అనువాదం మెరుగుపడేందుకు చాన్సుంది. అయితే, తుక్కుగూడ సభ ప్రతిష్ఠాత్మకం అయినందునే ఆయనను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇకపై స్థానికంగా జరిగే సభల్లో వేరొకరిని అనువాదానికి వినియోగించుకుటారేమో చూడాల్సి ఉంది. వాస్తవానికి యుద్ధ విమాన పైలట్, రాష్ట్రపతి భవన్ మాజీ ప్రధాన భద్రతాధికారి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి హిందీ, ఇంగ్లిష్ భాషలపై పట్టుంది. అయితే, అనువాదం చేసే విషయానికి వచ్చేసరికి మాత్రం ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News