ఒక్క చాన్స్...ఇదే చివరి చాన్స్

అవును నిజమే ఈసారి ఒక్క ఛాన్స్ ఇస్తే అదే చివరి ఛాన్స్ అవుతుంది. తృప్తిగా పనిచేసిన అనందంతో రాజకీయ విరమణ ప్రకటన చేయవచ్చు.

Update: 2024-11-09 07:30 GMT

అవును నిజమే ఈసారి ఒక్క ఛాన్స్ ఇస్తే అదే చివరి ఛాన్స్ అవుతుంది. తృప్తిగా పనిచేసిన అనందంతో రాజకీయ విరమణ ప్రకటన చేయవచ్చు. ఇది ఒకరిద్దరి భావన కాదు అనేక మంది ఆలోచన. విశాఖలోని టీడీపీ కూటమి నేతలలో ఒక్క ఛాన్స్ దక్కితే చాలు అన్న కోరిక అయితే నిండుగా ఉంది.

ఉత్తరాంధ్రాలో మంత్రి పదవుల కోసం చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే అయిదు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం కొత్త వారికి జూనియర్ నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో సీనియర్లు ఒకింత విస్తుబోయారు. అంతే కాదు ఆశాభంగానికి గురి అయ్యారు

అయితే ఇటీవల కాలంలో మంత్రివర్గం లో మార్పులు చేర్పులు జరుగుతాయని వార్తలు రావడం ఆ విధంగా ప్రచారం సాగడంతో వారిలో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా తమకు చాన్స్ దక్కుతుందేమో అని భావిస్తున్నారు. పైగా సీనియర్లుగా తమ అనుభవం ఈ సమయంలో ప్రభుత్వానికి కావాల్సి ఉందని కూడా తలపోస్తున్నారు.

విశాఖ జిల్లాకు ఈ రోజుకీ మంత్రి లేరు. ఆ పదవి కోసం చాలా మంది చూస్తున్నారు. ఏపీ టీడీపీ చీఫ్ అయినా కూడా పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి మీదనే కోరిక ఉందని అంటున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్ నేత. ఈ దఫాతో మంత్రిగా పనిచేసి రాజకీయం చాలిస్తారు అని అంటున్నారు. ఆయన ఎప్పటికపుడు వైసీపీ మీద నిప్పులు చెరుగుతూ కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలలో చర్చకు పెడుతూ జనంలో తాను మమేకం అవుతున్నారు.

గంటాకు ఒక విధంగా మంత్రి పదవి ఇస్తే విశాఖ జిల్లాలో అభివృద్ధి స్పీడ్ అందుకుంటుందని ఆయన అనుచరులు అంటున్నారు. అదే విధంగా ఇప్పటికి నాలుగు సార్లు గెలిచినా మంత్రి కాలేకపోయిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కూడా తనకు చాన్స్ దక్కాలని ఆశిస్తున్నారు. ఆయన కూడా ఈ దఫాతో ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని అంటున్నారు.

ఇక జనసేనలో చూసుకుంటే సీనియర్ నేతగా ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామక్రిష్ణ కూడా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఇక విస్తరణ జరిగినా మార్పు చేర్పులు ఉన్నా తన పేరు పరిశీలిస్తారన్న ఆశ ఆయనతో పాటు అనుచరులలో ఉందని అంటున్నారు. కొణతాలకు ఇదే చివరి చాన్స్ అని అంటున్నారు

విజయనగరం జిల్లాలో చూసుకుంటే సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు కూడా మంత్రి పదవి దక్కితే చాలు అదే పదివేలు అన్నట్లుగానే ఉన్నారని అంటున్నారు. ఆయన 1983 నుంచి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు ఆయనకు ఈ ఎన్నికలతో రాజకీయానికు ఫుల్ స్టాప్ పెట్టాలని ఉందని అంటున్నారు. అది కూడా మంత్రిగా చేసి సంతృప్తిగా రిటైర్ కావాలని భావిస్తున్నారు అని అంటున్నారు. అలాగే ఎస్ కోటకు చెందిన సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి దాదాపుగా ఇదే చివరి చాన్స్ అని అంటున్నారు. వచ్చే సారి అక్కడ కొత్త వారికి అవకాశం ఉంటుంది. దాంతో జీవితంలో ఒకసారి అయినా మంత్రిగా చేసి రిటైర్ కావాలని చూస్తున్నారు అంటున్నారు

శ్రీకాకుళంలో చూస్తే ఆముదలవలస నుంచి కూన రవికుమార్ రేసులో ఉన్నారు. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ని ఓడించిన నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కూడా మంత్రి అయితే చాలు ఈ రాజకీయానికి అనుకుంటున్నారు. ఇచ్చాపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న బెందాళం అశోక్ సైతం మంత్రి పదవి దక్కితే వచ్చే ఎన్నికలకు రాజెవరో మంత్రి ఎవరో అన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

వీరంతా కనీసం రెండేళ్ళ తరువాత విస్తరణలో అయినా చాన్స్ దక్కుతుందని అనుకుంటున్నారు. అయితే జమిలి ఎన్నికలు అని ముందుకు వస్తే ఈ మధ్యలో మార్పులు చేర్పులు ఉంటాయని తమకు కూడా అవకాశం దక్కుతుందని లెక్క వేసుకుంటున్నారుట. చూడాలి మరి ఏమి జరుగుతుందో, ఎవరికి అమాత్య యోగం ఉందో. అది ఎప్పటికి సాకారం అవుతుందో.

Tags:    

Similar News