వర్ల రామయ్య ఈసారైనా లక్కుని తొక్కుతారా...!?

ఇదిలా ఉంటే రాజ్యసభలో ఈసారి వర్ల రామయ్యను కూర్చోబెట్టడం ద్వారా ఎస్సీ సామాజిక వర్గం పట్ల తమ నిబద్ధతను చాటాలని టీడీపీ భావిస్తోందిట.

Update: 2024-02-01 02:45 GMT

వర్ల రామయ్య మాజీ పోలీస్ అధికారి. టీడీపీని నమ్ముకుని రెండు దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వస్తున్నా చట్ట సభల ముఖం చూసింది లేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య టీడీపీకి అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యే కావాలని ఉంది. అలాగే అవకాశం ఇస్తే పెద్దల సభలో కూర్చోవాలని ఉంది.

ఇప్పటికి ఆరేళ్ళ క్రితం రాజ్యసభ ఎన్నికల్లో చివరి దాకా ఆయన పేరు టీడీపీ పరిశీలనలోకి వచ్చింది. అయితే ఆఖరు నిముషంలో బిగ్ షాట్ కి టికెట్ కట్టబెట్టారు. అలా ఎవరూ ఊహించని విధంగా కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభ మెట్లు ఎక్కగలిగారు. రామయ్య అలా ఉండిపోయారు.

ఆ మీదట అవకాశాలు ఇవ్వడానికి టీడీపీ అధికారం నుంచి దిగిపోయి విపక్షంలోకి వచ్చేసింది. రాజ్యసభ ఎంపీని గెలిపించుకునే పాటి ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి లేవు. అందులో కూడా నలుగురు రెబెల్స్ గా ఉన్నారు. దీంతో టీడీపీ బలం సరిపోవడం లేదు.

అయినా సరే టీడీపీ 2020 రాజ్యసభ ఎన్నికల వేళ ట్రై చేసింది. వర్ల రామయ్యను నాడు అభ్యర్ధిగా పెట్టి పోరాడింది. టీడీపీ ఓట్లే ఆ పార్టీకి పడ్డాయి కానీ నాడు వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగలేదు. అలా వర్ల ఓటమి పాలు అయ్యారు. అయితే 2024లో వర్ల రామయ్యనే మరోసారి రాజ్యసభ రేసులోకి దించాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.

నిజానికి ఇపుడు కూడా టీడీపీ నంబర్ అంతేలా ఉంది. కానీ టీడీపీ ఆశ ఏంటి అంటే వైసీపీనే. ఆ పార్టీలో టికెట్లు దక్కని వారు అంతా పరుగున టీడీపీ వైపు వస్తున్నారు. అలా వస్తున్న వారిని టీడీపీ జాగ్రత్తగా తన వైపు ఉంచుకుంటోంది. వారికి కండువాలు కప్పి అనర్హులను చేయకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. రాజ్యసభ ఎన్నికలు అయ్యాక వారంతా అఫీషియల్ గా టీడీపీ మెంబర్స్ అవుతారు అన్న మాట.

ఇక టీడీపీ వైపు వస్తున్న వారే కాకుండా టీడీపీకి వైసీపీ శిబిరం వైపు ఉండి కూడా భరోసా ఇస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారట. టీడీపీ నేతల అంచనాలు లెక్కల ప్రకారం చూస్తే కనుక ఆ నంబర్ యాభై దాకా ఉందిట. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ధి గెలుపు కోసం అవసరం అయిన మ్యాజిక్ నంబర్ 44 మాత్రమే. అంటే దాని కంటే ఎక్కువ ఓట్లే తమకు దక్కుతాయన్న ధీమాతో టీడీపీ ఉంది.

పైగా గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలాంటి క్రాస్ ఓటింగ్ ప్రయోగం చేసి దండీగా లాభం పొందిన రికార్డు టీడీపీకి ఉంది. అలా అధికార పక్షానికి షాక్ తినిపించిన చంద్రబాబు చాణక్యం ఈసారి కూడా పనిచేస్తుంది అని ఆ పార్టీ వారు నమ్ముతున్నారు. అందుకే ధీమాగా ఈసారి రాజ్యసభలో తమకు ఒక సీటు గ్యారంటీ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఇదిలా ఉంటే రాజ్యసభలో ఈసారి వర్ల రామయ్యను కూర్చోబెట్టడం ద్వారా ఎస్సీ సామాజిక వర్గం పట్ల తమ నిబద్ధతను చాటాలని టీడీపీ భావిస్తోందిట. ఇప్పటికి రెండు సార్లు వర్లకు హ్యాండ్ ఇచ్చినట్లు అయిందని, ఈసారి మాత్రం ఆయనను పెద్దల సభలో కూర్చోబెట్టడం ద్వారా తన లక్ష్య శుద్ధిని తెలియచేయడంతో పాటు ఎన్నికల వేళ వైసీపీకి భారీ ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయింది అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే వర్ల రామయ్య రాజకీయ జాతకం ఇపుడైనా టర్వ్ అవుతుందా అన్నది మరో చర్చ. ఆయన ఈ దఫా అయినా లక్కుని తొక్కుతారా తన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆయన పెద్దల సభకు వెళ్ళి దర్జాగా ఆ పదవిని అందుకుంటారా అన్నది ఆయన అభిమానులతో పాటు అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్న విషయంగా ఉంది.


Tags:    

Similar News