నాగబాబుకు పదవి...వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దాంతో ఈ రకమైన పొలిటికల్ స్పెక్యులేషన్స్ సాగుతూనే ఉన్నాయి.

Update: 2024-11-09 11:44 GMT

మెగా బ్రదర్ జనసేన జనరల్ సెక్రటరీ అయిన నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కుతుందని ఆ మీదట ఆయన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రిగా చేరుతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దాంతో ఈ రకమైన పొలిటికల్ స్పెక్యులేషన్స్ సాగుతూనే ఉన్నాయి.

మరో వైపు చూస్తే నాగబాబుని టీటీడీ చైర్మన్ గా నియమిస్తారు అని కూడా ఆ మధ్య ప్రచారం సాగింది. దానికి నాగబాబే తనకు పదవుల మీద ఆసక్తి లేదని చెప్పేశారు. ఇక ఆయనకు కీలకమైన పదవులు అనేకం వస్తాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న చర్చగానే ఉంది.

ఇంతకీ నాగబాబుకు పదవులు వస్తాయా వస్తే ఆయన కుటుంబం రియాక్షన్ ఏంటి అసలు నాగబాబుకు పదవులు అంటే ఇష్టం ఉందా లేదా అన్నది కూడా అందరి మదిలో మెదిలే ప్రశ్నలే. దానికి ఒక వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో వరుణ్ తేజ్ స్పందిస్తూ తన తండ్రి నాగబాబుకు పదవులు అంటే అంత అపేక్ష లేదని స్పష్టం చేశారు.

తన తండ్రి పదవుల కంటే కూడా తన సోదరులకు అండగా నిలవడమే ఎక్కువగా తన బాధ్యతగా తీసుకుంటారు అని అన్నారు. ఆనాడు ప్రజారాజ్యంలో చేసినా ఇపుడు జనసేనలో పనిచేస్తున్నా నాగబాబు సోదరుల కోసమే వెన్నంటి నిలబడ్డారని వరుణ్ తేజ్ చెప్పారు. తన తండ్రి లాంటి బ్రదర్ ఉండడం గ్రేట్ అని వరుణ్ తేజ్ మంచి మాటలు చెప్పారు.

తన తండ్రి మెగా కుటుంబం నుంచి అండగా ఉండేందుకే జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలిచారు అని అన్నారు. ఆయన ఏ పదవులూ ఆశించి పార్టీలో పని చేయలేదని కూడా గుర్తు చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవడం పట్ల కూడా ఆయన ఏ విధంగానూ ఫీల్ కాలేదని చెప్పారు. 2019లో నర్సాపురంలో పోటీ చేసి ఓడినా నాగబాబు ఏమీ బాధపడలేదని అన్నారు.

తన తండ్రికి పదవుల కంటే కూడా తన కుటుంబ సభ్యులు మంచి స్థానాలలో ఉన్నారని చూసి సంతోషించడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుందని అన్నారు. తాను కూడా తన తండ్రి సంతోషమే ముఖ్యమని అనుకుంటాను అన్నారు. ఇక ఇటీవల తన తండ్రికి మోకాలి ఆపరేషన్ జరిగిందని దాని వల్లనే ఆయన కొద్దిగా జనసేన యాక్టివిటీస్ కి దూరం అయ్యారని మళ్లీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

పిఠాపురంలో పవన్ పోటీ చేసిన నేపధ్యంలో నాగబాబు మొత్తం నెలల తరబడి పనిచేసారని కూడా ఆయన గుర్తు చేశారు. తమ కుటుంబం కూడా ఎన్నికల ప్రచారం చేసిందని అన్నారు తాము ఎపుడూ కుటుంబపరంగా మద్దతుగా ఉంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం తన వంతుగా పాత్ర పోషిస్తామని వరుణ్ తేజ్ అన్నారు. అంతే తప్ప పదవుల విషయంలో మాత్రం ఏ కోరికలూ తమ కుటుంబానికి లేవు, నాగబాబు విషయానికి వస్తే ఆయన పదవులు లేకపోతేనే ఎక్కువ ఆనందంగా ఉంటారని వరుణ్ తేజ్ అన్నారు.

ఆయన ఆ విధంగా ఉండడమే తమ కుటుంబానికి కూడా కావాల్సింది అని అన్నారు. మొత్తానికి పదవుల కోసం రక్త సంబంధాలను తెంచుకుంటూ రోడ్డున పడుతున్న ఈ రోజులలో మెగా బ్రదర్ నాగబాబు వైఖరి చూసిన వారిని నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. పదవులు అధికారం అంటే అందరికీ మోజే. కానీ నాగబాబు లాంటి వారు మాత్రం దానికి అతీతులు అని ఆయన కుమారుడి మాటలను విన్న వారు నిజంగా గ్రేట్ అని అనుకోక తప్పదు.

నాగబాబు సైతం ఏ రోజూ పదవులు కావాలని ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు అన్నది అంతా గుర్తు చేసుకుంటారు. సో నాగబాబుకు పదవులు వస్తే ఆనందించే వారు మిగతా వారు అయి ఉండొచ్చేమో కానీ ఆయన మాత్రం పదవులు వచ్చినా రాకపోయినా జనసేనకే తన పూర్తి సమయం ఇస్తానని కట్టుబడిపోయారు అని అంటున్నారు.

Tags:    

Similar News