అన్న రాహుల్ తో తమ్ముడు వరుణ్ చేతులు కలుపుతారా...?
ఇపుడు ఈ ఇద్దరి ముద్దుల తమ్ముడు వరుణ్ గాంధీ వీరితో చేతిలో కలుపుతారా అన్న చర్చ అయితే వేడిగా వాడిగా ఉంది.
గాంధీల వంశంలో ఇపుడు నాలుగవ తరం రాజకీయాలో సాగుతోంది. కాంగ్రెస్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ గాంధీలు ముందుకు అడుగులు వేస్తున్నారు. రాజీవ్ గాంధీ వరకూ ఎకాఎకీని దేశానికి ప్రధానులు అయ్యారు కానీ ఆ తరువాత మాత్రం మొత్తం రాజకీయం మారిపోయింది. ఇప్పటికి మూడున్నర దశాబ్దాలుగా గాంధీలు ప్రధాని పీఠం ఎక్కలేదు.
మధ్యలో అనేక అవకాశాలు వచ్చినా కూడా వారు వదులుకున్నారు. అలా కనుక చూస్తే రాజీవ్ మరణానంతరం 1991లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయాల మీద ఆసక్తి లేదని సోనియాగాంధీ తప్పుకున్నారు. ఆ విధంగా పీవీ నరసింహారావు దేశానికి ప్రధాని అయ్యారు.
ఇక 1996 నుంచి 1998 దాకా యునైటెడ్ ఫ్రంట్ కధ సాగింది. 1998 నుంచి 2004 వరకూ ఎన్డీయే రాజ్యమేలింది. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకూ యూపీయే పవర్ లోకి వచ్చింది. పదేళ్ల పాటు కాంగ్రెస్ జమానా సాగినా సోనియా కానీ రాహుల్ కానే ఆ పదవి వైపు చూడలేదు, 2014 నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు బీజేపీ గెలిచింది. మూడవసరి గెలిచి హ్యాట్రిక్ ప్రధాని కావాలని నరేంద్ర మోడీ చూస్తున్నారు
ఒక విధంగా ఇపుడున్న పరిస్థితులు బీజేపీకి మోడీకి మొగ్గుగా ఉన్నట్లుగా తోస్తున్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కి ఇది చావో రేవో అన్న ఎన్నికలు కాబోతున్నాయి. ఈసారి గెలవకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అందుకే గాంధీలు అంతా కలుస్తున్నారు అన్న ప్రచారం అయితే ఉంది. రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ స్వయాన అన్నా చెల్లెళ్ళు. వారు దేశమంతా తిరిగి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకుని రావడానికి ఈసారి చేయాల్సిన కృషి అంతా చేస్తారు. ఇందులో రెండవ మాటకు తావు లేదు
ఇపుడు ఈ ఇద్దరి ముద్దుల తమ్ముడు వరుణ్ గాంధీ వీరితో చేతిలో కలుపుతారా అన్న చర్చ అయితే వేడిగా వాడిగా ఉంది. వరుణ్ గాంధీ రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ ఏకైక కుమారుడు ఆయన 1980లో మరణించాక కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబం నుంచి సంజయ్ సతీమణి మేనకాగాంధీ వేరుపడిపోయారు. ఆమె కాంగ్రెసేతర పార్టీలలో ఉన్నారు.పలు మార్లు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు.
ఇక ఆమె బీజేపీలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. వరుణ్ గాంధీ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఫిలిబిత్ నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయనకు ఎల్ కే అద్వానీ హయాంలో మొదట్లో బీజేపీ నుంచి మంచి పదవులు లభించాయి. అయితే నరేంద్ర మోడీ అమిత్ షా టీం బీజేపీ లో కీలక పాత్ర పోషించడంతో వరుణ్ గాంధీకి కొంత ఇబ్బంది ఏర్పడింది అని అంటారు.
ఇక మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవిని వరుణ్ గాంధీ ఆశించారు. కానీ దక్కలేదు. అలాగే ఆయన 2017లో యూపీలో బీజేపీ గెలిచిన తరువాత సీఎం పదవిని ఆశించిన వారిలో ఒకరు అని అంటారు. కానీ బీజేపీ పెద్దలు పట్టించుకోలేదు. 2022లో జరిగిన యూపీ ఎన్నికల్లో వరుణ్ బీజేపీకి పెద్దగా ప్రచారం చేయలేదని అంటారు.
2019 లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీ హై కమాండ్ తో ఆయనకు గ్యాప్ ఏర్పడింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కరోనా టైం లో మోడీ పనితీరుని విపక్షాలతో పాటుగా వరుణ్ విమర్శించారు అని ప్రచారంలో ఉంది. ఇక యూపీ సీఎం గా యోగి ఉన్నారు. కానీ ఆయనతో బాగానే గ్యాప్ ఉంది.
లేటెస్ట్ గా యూపీ సీఎం ని గురి పెడుతూ వరుణ్ చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా వరుణ్ గాంధీ తన లోక్ సభ నియోజకవర్గం ఫిలిబిత్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ యోగీ మీద సెటైర్లు పేల్చారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆ సభలో పాల్గొన్న ఓ సాధువు ఫోన్ మోగింది. దీనిని గమనించిన వరుణ్ మాట్లాడుతూ ఆ సాధువు ఫోన్‌ను స్విచాఫ్ చేయాలని ఎవరూ అడగవద్దని కార్యకర్తలను కోరారు.
దయచేసి ఆయనను ఆపవద్దు. మహరాజ్ జీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఎవరికి తెలుసు అప్పుడు మనకు ఏం జరుగుతుందో’ అని వ్యంగ్యంగా అన్నారు. దాని అర్ధం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్‌లోని గోరక్ష పీఠాధీశ్వరుడు అనే సంగతి తెలిసిందే. ఆయన నిరంతరం కాషాయ వస్త్రాలు ధరించి కనిపిస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు అనూహ్యంగా చేపట్టారు.
దాన్ని పట్టుకునే వరుణ్ ఈ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ వీడియో ఇపుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీలో వరుణ్ గాంధీ ఇమడలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవచ్చు అని అంటున్నారు. దాంతో ఆయన ఆల్టర్నేషన్ గా గాంధీల పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతారా అన్న చర్చ నడుస్తోంది.
తన అన్న రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి తమ్ముడు వరుణ్ చేతులు కలుపితే మాత్రం అది భారత దేశ రాజకీయాలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో గొప్ప మలుపు సంచలనం అవుతుంది అని అంటున్నారు. సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ ఎపుడూ కలసి కాంగ్రెస్ రాజకీయాలు చేయలేదు. సంజయ్ మరణానంతరం రాజీవ్ గాంధీ పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇపుడు వారి వారసులు చేతులు కలిపితే పాత్ర నవతరం కాంగ్రెస్ నేతలకు ఇది హుషార్ ని ఇస్తుంది అని అంటున్నారు.