టీడీపీలో చేరికపై వసంత క్లారిటీ... ఉమతో విభేదాలపై కీలక వ్యాఖ్యలు!
ఎన్నికల సీజన్ కావడంతో ఇప్పుడు వీరిని గురించిన చర్చ బలంగా నడుస్తుంది. ఈ సమయంలో తాజాగా వసంత కృష్ణప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యంత సహజంగా జరిగే పార్టీల మార్పు అంశం ఈసారి మాత్రం అంతకు మించి అన్నట్లుగా సాగుతుంది. ఈ సమయంలో తామున్న పార్టీలో టిక్కెట్ దక్కలేదనే కారణంతో కొంతమంది.. పార్టీ సస్పెండ్ చేయడంతో ఇంకొంతమంది పక్క పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ఇప్పుడు వీరిని గురించిన చర్చ బలంగా నడుస్తుంది. ఈ సమయంలో తాజాగా వసంత కృష్ణప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది.
అవును... ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పుల్లో భాగంఘా మైలవరం టిక్కెట్ కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్... త్వరలో టీడీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న ఆయన.. తాజాగా చంద్రబాబుతో మాట్లాడి ఈ విషయంపై స్పష్టత తీసుకున్నారని అంటున్నారు. పార్టీలో చేరికపై మాత్రమే కాకుండా.. ప్రధానంగా మైలవరం టిక్కెట్ పై బాబుతో హామీ తీసుకున్నారని తెలుస్తుంది.
తాజాగా ఈ విషయాలపై మాట్లాడిన వసంత కృష్ణప్రసాద్... నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేసుకోమన్నారని చంద్రబాబు తనతో చెప్పినట్లు వసంత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మీడియా ముందు ఈ టీడీపీలో చేరిక, మైలవారం టీడీపీ టిక్కెట్ ఖరారు, దేవినేని ఉమతో ఉన్న విభేదాలు మొదలైన అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు!
ఈ మేరకు టీడీపీలో చేరికపై మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్... మరో రెండు మూడు రోజుల్లో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం అధికారికంగా టీడీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు! ఇదే సమయలో టీడీపీ టిక్కెట్ పై మైలవరం నుంచి తిరిగి తానే పోటీ చేయబోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనతో పాటు తన అనుచరులంతా టీడీపీలో చేరతారని తెలిపారు.
ఇదే సమయంలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుతో శతృత్వం అంశంపై కృష్ణ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా.. ఉమతో తనకు ఉన్నవి ఆస్తి తగాదానో, మరో రకం తగాదానో కాదని.. కేవలం రాజకీయ పరమైన విభేదాలు మాత్రమే అని చెప్పడం గమనార్హం! దీంతో తాను టీడీపీలో చేరిన తర్వాత ఉమతో పాటు టీడీపీ కార్యకర్తలందరినీ కలుపుకుపోతానని వసంత తెలిపారు.
మరోపక్క ఇప్పటికే దేవినేని ఉమతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో మైలవరం టిక్కెట్ వసంత కృష్ణప్రసాద్ కు ఇవ్వడం తప్పడం లేదనే కామెంట్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ విషయంపై స్పందించిన ఉమ... చంద్రబాబు మాటే తనకు శిరోధార్యం అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అని ఉమ చెప్పుకున్నారు!!