రెండు ప్రత్యేక విమానాలు.. ఆగమేఘాలపై నామినేషన్ పత్రాలు.. వీర్రాజు లెవెలే వేరు!
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన బీజేపీ నేత సోము వీర్రాజు బ్యాక్ గ్రౌండ్ అందరికీ తెలిసిందే.;
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన బీజేపీ నేత సోము వీర్రాజు బ్యాక్ గ్రౌండ్ అందరికీ తెలిసిందే. పక్కా బీజేపీ వాది అయిన వీర్రాజు ఆర్ఎస్ఎస్ భావజాలంతో పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటారని పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన కోసం ప్రత్యేకంగా ఎమ్మెల్సీ స్థానాన్ని అడిగి తీసుకుంది బీజేపీ. వాస్తవానికి ఈ దఫా బీజేపీకి ఎమ్మెల్సీ కేటాయించే అవకాశం లేకపోయినా కమలం పెద్దలు రంగంలోకి దిగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కాదనలేకపోయారు.. ఇక చివరి నిమిషంలో వీర్రాజుకు ఎమ్మెల్సీ ఖరారు అయిన తర్వాత ఆయన కోసం ‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేయడం చూస్తే బీజేపీలో వీర్రాజుకు పొజిషన్ ఏంటో అర్థమవుతుందని అంటున్నారు.
సోము వీర్రాజు కాబోయే ఎమ్మెల్సీయే కాదు. ఏపీ బీజీపీకి మాజీ అధ్యక్షుడు. పార్టీలో ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నా, అధిష్టానంలో మాత్రం వీర్రాజుకు మంచి పట్టు ఉందని చెబుతున్నారు. సంఘ్ అండదండలతో బీజేపీలో తాను అనుకున్నది వీర్రాజు సాధించుకుంటారని ఆయన అనుచరులు చెబుతుంటారు. దీనికి తాజా ఉదాహరణే ఆయన ఎమ్మెల్సీ నామినేషన్. సాధారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ కు ఏ మాత్రం హడావుడి ఉండదు. పార్టీ ఎమ్మెల్యేలు, మిత్రపక్షాల వారు హాజరై మద్దతుగా ప్రకటించి, అయ్యిందనిపిస్తారు. కానీ, నిన్న మధ్యాహ్నం వీర్రాజు కోసం జరగిన హడావుడి చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.
కూటమికి పూర్తి బలం ఉండటంతో వీర్రాజు ఎన్నిక లాంఛనమే. అయితే ఆయన బీజేపీ అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే నామినేషన్ సమయంలో ఏ, బీ, ఫారంలు నామినేషన్ పత్రాలతో జత చేయాలి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏ ఫారం జారీ చేస్తే, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీ-ఫారం అందిస్తారు. అయితే వీర్రాజు అభ్యర్థిత్వం ఆఖరి నిమిషంలో ఖరారు అయింది. మరో వైపు ఈ రెండు పత్రాలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బీజేపీలో టెన్షన్ మొదలైంది. ఏ ఫారం హైదరాబాద్ లో ఉండగా, బీ-ఫారంపై సంతకం చేయాల్సిన పురందేశ్వరి ఢిల్లీలో ఉండిపోయారు. దీంతో నామినేషన్ దాఖలు చేసే సమయానికి ఈ రెండు పత్రాలు లేకపోతే ఏంటన్న టెన్షన్ ఎక్కువైంది. దీంతో వీర్రాజు కోసం బీజేపీ హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థిగానే వీర్రాజుతో నామినేషన్ వేయించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేక విమానం, ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏ ఫారంను బీజేపీ నేతలు తీసుకువస్తే, హడావుడిగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన పురందేశ్వరి.. గన్నవరం విమానాశ్రయానికే బీ-ఫారం తెప్పించుకుని అక్కడే సంతకం చేశారట. అలా హడావుడిగా నామినేషన్ దాఖలు చేయించడమే కాకుండా, డబ్బు లెక్క చేయకుండా వీర్రాజు కోసం బీజేపీ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈ సారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కాస్ట్ లీ అంటున్నారు.