ప్రపంచ కప్ కాలంలో కూరగాయల 'డబుల్ సెంచరీ'.. 'సెంచరీ'

ఇప్పుడంతా ప్రపంచ కప్ క్రికెట్ సమయం.. టీమిండియా అప్రతిహతంగా దూసుకెళ్తోంది

Update: 2023-11-05 08:23 GMT

ఇప్పుడంతా ప్రపంచ కప్ క్రికెట్ సమయం.. టీమిండియా అప్రతిహతంగా దూసుకెళ్తోంది.. సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకుని ఎవరొస్తారో రండి అంటోంది.. ఇక ప్రధాన జట్ల బ్యాట్స్ మెన్లు మేమంటే మేమంటూ పోటీ పడి సెంచరీలు కొడుతున్నారు. భారత సంతతి న్యూజిలాండ్ యువ కెరటం రచిన్ రవీంద్ర మూడు సెంచరీలు, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డికాక్ నాలుగు శతకాలు బాదేశారు. ఆ జట్టు బ్యాట్స్ మన్ డసెన్ కూడా రెండు సెంచరీలు చేశాడు. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) సైతం రెండుసార్ల మూడంకెల స్కోరు చేరుకున్నాడు. అయితే, ప్రపంచ కప్ లో బ్యాట్స్ మెన్ తరహాలోనే కూరగాయల ధరలు దూసుకెళ్తున్నాయి.

అది లేకుంటే వంట అసంపూర్తి

మొన్నటివరకు ‘‘టమంట’’. దేశంలో టమాట ధరలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాయి. అంతకుమందు వరకు 20 రూపాయిలు కూడా లేని టమాట ధర ఐదారు రెట్లు పెరిగేసరికి ప్రజలు అవాక్కయ్యారు. ఇక రైతులేతే రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ఈ పొంగు ఓ నెల రోజుల పైనే నడిచింది. క్రమంగా టమాట ధర దిగొచ్చింది. ఇప్పుడు 20-30 రూపాయిలకే కిలో దొరుకుతోంది. అయితే, ఈలోగా మరో కూరగాయ ధర ఆకాశాన్ని అంటుతోంది. ఈ ప్రపంచ కప్ కాలంలో సెంచరీ కొట్టేసింది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే చెప్పే ఉల్లిగడ్డల ధర చూస్తుండగానే మూడంకెలకు చేరుకుంది. ఉల్లి పాయ లేకుంటే వంట రుచి కుదరదని భావించే తెలుగువారికి గుబులు రేపుతోంది.

మొన్నటివరకు 30-40

ఉల్లిగడ్డల ధర మొన్నటివరకు రూ.30 నుంచి 40 మధ్యనే ఉంది. అయితే, అనూహ్యంగా 15 రోజుల నుంచి ధర పెరుగుతూ పోతోంది. రెండు రోజుల కిందట రూ.80 వరకు ఉన్న ధర.. తాజాగా రూ.100 కు చేరిందంటున్నారు. అదికూడా మన హైదరాబాద్ లోనే కావడం గమనార్హం. ఉప్పల్ పెద్ద మార్కెట్ వ్యాపారుల కథనం ప్రకారం.. రకాన్ని బట్టి ఉల్లి గడ్డల ధర రూ.80 నుంచి రూ.100 దాకా ఉందని అంటున్నారు. అయితే, రూ.100 కు చేరినట్లుగా తెలుసుకుని ప్రజలు కొనకుండానే వెనుదిరుగుతున్నారని పేర్కొంటున్నారు.

కేంద్రం ముందే మేల్కొన్నా..?

ఉల్లిగడ్డల ధరలు మండిపోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం 10 రోజుల కిందటనే గుర్తించింది. ఎగుమతులపై ఆంక్షలు విధించింది. కానీ, అప్పటికే చేయిదాటిపోయింది. దేశీయంగా వ్యాపారులు ధరలు పెంచేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ ను మూడు నెలల కిందటనే మార్కెట్ లోకి విడుదల చేసింది. 40 శాతం ఎగుమతి సుంకం విధించినట్లుగా వార్తలు వచ్చాయి. కాగా, హైదరాబాద్ కు ఉల్లి గడ్డలు కర్నూలు, మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఈ రెండు మేలు రకాలు. అయితే, ఈ ఏడాది పంట దెబ్బతినడం, అకాల వర్షాల కారణంగా ఇబ్బంది ఎదురైంది. దీంతో ధరలు డిసెంబరు వరకు ఇదే విధంగా ఉంటాయని చెబుతున్నారు.

Tags:    

Similar News