వేమిరెడ్డి ఇస్తున్న సందేశం ?
ఆయనే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. అంగబలం అర్ధబలంలో చాలా తక్కువ మంది ఆయనతో సరితూగుతారు అని పేరు.
ఆయన స్వతహాగా దిగ్గజ వ్యాపారవేత్త. ఆ మీదట రాజకీయ నాయకుడిగా మారారు. వైసీపీ నుంచి 2018లో ఆయన రాజ్యసభ సభ్యునిగా గెలిచి నేరుగా పెద్దల సభలో అడుగుపెట్టారు. అలా ఆయన రాజకీయ జీవితం సింహద్వారం నుంచే మొదలైంది అని చెప్పాలి. ఆయనే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. అంగబలం అర్ధబలంలో చాలా తక్కువ మంది ఆయనతో సరితూగుతారు అని పేరు.
ఆయనది నెల్లూరు జిల్లా. ఇక సామాజిక కార్యక్రమాల ద్వారా జనంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయంగా కూడా ఆ దీవెనలతో బలపడ్డారు. ఆయన వైసీపీలో ఉన్నపుడు జగన్ కి అత్యంత ఆప్తుడిగా మెలిగారు. అయనను రాయలసీమ జిల్లాలకు ఇంచార్జి గా కూడా వైసీపీ తరఫున జగన్ అప్పట్లో నియమించారు.
అయితే 2024 ఎన్నికలలో మాత్రం వ్యవహారం చెడింది. అయనకు లోక్ సభ సీటు ఖరారు అయినా ఆయన చెప్పిన వారికే అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని షరతు విధించడంతో దానికి జగన్ అంగీకరించకపోవడంతో ఆయన వైసీపీని వీడరు. కట్ చేస్తే టీడీపీ ఆయనను అక్కున చేర్చుకుంది. ఆయనకు నెల్లూరు ఎంపీ సీటు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి కోవూరు అసెంబ్లీ సీటు ఇచ్చింది.
వేమిరెడ్డి దూకుడు ముందు వైసీపీ కుదేలు కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో టీడీపీ భారీ సక్సెస్ ని అందుకుంది. ఇక ఎన్నికలు ముగిసాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయింది. లేటెస్ట్ గా చూస్తే అన్న గారి వర్ధంతి వేళ ఒక భారీ ఫుల్ పేజీ ప్రకటన సాక్షిలో వచ్చింది.
ఏపీలో చూస్తే రాజకీయం మాదిరిగానే మీడియా కూడా రెండు ముక్కలుగా మారింది. సాక్షి అంటే వైసీపీ అధినేతది. కలలో కూడా టీడీపీ నేతల ప్రకటనలు అందులో వేయాలని అనుకోరు. అటువంటి పూర్వపు వాసనల ప్రభావమా లేక వర్తమానంలో వచ్చిన మార్పునా తెలియదు కానీ వేమిరెడ్డి యాడ్ అయితే సాక్షిలో ఇచ్చారు. అలా టీడీపీ అంటే బద్ధ రాజకీయ వైరం ఉన్న మరో పేపర్ లో ఆ పార్టీ పెద్దల ఫోటోలతో భరీ కలర్ ఫుల్ యాడ్ దర్శనం ఇచ్చింది.
ఇపుడు ఇదే అతి పెద్ద చర్చగా మారింది. నెల్లూరు రాజకీయాలు ఎపుడూ దూకుడుగా ఉంటాయి. ఏమైనా సంకేతాలు వచ్చినా అక్కడి నుంచే వస్తాయని అంటారు. గతంలో టీడీపీ అయినా 2024 ముందు వైసీపీ అయినా నెల్లూరు ముసలాన్ని చవి చూసిన పార్టీలే అని అంటున్నారు.
మరి వేమిరెడ్డి యాడ్ ఎందుకు ఇచ్చారు దాని వెనక సందేశం ఏంటి అన్న చర్చ సాగుతోంది. దీనికి కాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కనుక వేమిరెడ్డి ఆ మధ్యన ఒక జిల్లా పరిషత్ మీటింగ్ కి వెళ్తే ప్రోటోకాల్ మర్యాదల విషయంలో అలిగి వాకౌట్ చేసి మరీ బయటకు వచ్చారు. ఆనాడు ఆయన పేరు అధికారులు పిలిచి వేదిక మీదకు రప్పించలేదని ఆయన అలిగారు
అయితే దానికే ఆయన అలిగారని కాదు అప్పటికే ఏదో అసంతృప్తి ఆయనకు ఉందని అనుకున్నారు. ఇపుడు అది కాస్తా మరింత పెరిగిందా అన్నది కూడా చర్చగా ఉంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తన మాట నెరవేరకపోవడం టీడీపీ లోకల్ లీడర్స్ ఆధిపత్యం చేయడం వంటివి వేమిరెడ్డికి మనస్తాపం కలిగించాయని అంటున్నారు.
అంతే కాదు ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకుంటే కూడా కొత్తగా గెలిచి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ కి దక్కింది అన్న అసంతృప్తి కూడా ఆయనలో ఉంది అని అంటున్నారు. ఇక టీడీపీలో ఆయన అంత సుఖంగా లేరని ఆయన బాధ వేరని అంటున్న వారూ ఉన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన సాక్షికి ఇచ్చిన యాడ్ ఒక ఝలక్ గా చూడాలా అన్నది కూడా చర్చకు వస్తోంది. సరే టీడీపీ నేతలు యాడ్ ఇచ్చినా ప్రచురించేందుకు సదరు సంస్థ ముందుకు వచ్చింది అంటే ఏదో సంథింగ్ పొలిటికల్ గా ఉంది అని కూడా అనుకుంటున్నారట. మొత్తానికి చూస్తే కనుక వేమిరెడ్డి జిల్లా లోకల్ పాలిటిక్స్ తో విసిగి వేసారారా అన్నదే హాట్ టాపిక్ గా ఉంది. చూడాలి మరి నెల్లూరు జిల్లాలో పరిణామాలు ఏ విధంగా మారుతాయో ఏమిటో.