2036 వరకు బీఆర్‌ఎస్ పై అనర్హత వేటు కుదురుతుందా?
తెలంగాణలో దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి
తెలంగాణలో దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వెలువరించిన నివేదిక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ఇది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ కు ఇబ్బందికరంగా పరిణమించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేత, మాజీ ఎంపీ వీహెచ్ హన్మంతరావు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్ పై 2035–36 వరకు అనర్హత వేటు వేయాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా రూ.1,44,544 కోట్లు అప్పులు చేసిందని.. దీన్ని తిరిగి చెల్లించడానికి రూ.2,52,048 కోట్లు అవసరమని కాగ్ తన నివేదికలో తెలిపిందని హన్మంతరావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఈ అప్పు వల్ల తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆ లేఖలో వీహెచ్ వివరించారు.
అవినీతిలో పాలుపంచుకున్న రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని తాను గట్టిగా భావిస్తున్నానని వీహెచ్ హనుమంతరావు తెలిపారు. బీఆర్‌ఎస్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇతర పార్టీలకు ఈ చర్య గుణపాఠంగా ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తిరిగి వచ్చేవరకు ఆ పార్టీని 2035–35 వరకు నిషేధించాలని ఎన్నికల సంఘానికి విన్నవించారు. అప్పటివరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ పార్టీని నిషేధించాలని విన్నవించారు.
అయితే వీహెచ్ హన్మంతరావు లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఇలా ఎవరూ పార్టీలను నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు దాఖలాలు లేవని అంటున్నారు. అలాగే వాటి గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసినట్టు కూడా లేదని చెబుతున్నారు.
ఒక రాజకీయ పార్టీపై నిషేధం విధించడానికి ఎన్నికల సంఘానికి అధికారం ఉంటే.. బీఆర్‌ఎస్ పై వీహెచ్ హన్మంతరావు ఆశించినట్టు చర్యలు తీసుకుంటే అది సంచలనాత్మకమే అవుతుందని చెబుతున్నారు.