ఎవరీ తురకా కిశోర్? అతడి అరెస్టు అంత సంచలనం ఎందుకు?

ఇంతకూ ఇతడెవరు? అతడి అరెస్టు ఎందుకంత హాట్ టాపిక్ అయ్యింది? అన్న వివరాల్లోకి వెళితే..

Update: 2025-01-06 05:52 GMT

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైసీపీకి చెందిన తురకా కిశోర్ అరెస్టు అయ్యారు. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరిలో జయపురి కాలనీలో ఉన్న అతడ్ని విజయపురి సౌత్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు.. ఇంతకూ ఇతడెవరు? అతడి అరెస్టు ఎందుకంత హాట్ టాపిక్ అయ్యింది? అన్న వివరాల్లోకి వెళితే..

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి తెలుసు కదా. అతగాడికి అత్యంత నమ్మకస్తుడు.. ప్రధాన అనుచరుడే ఈ తురకా కిశోర్. వైసీపీ హయాంలో మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ గా వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లి అరాచకాల్లో కీ రోల్ ప్లే చేసిన వారిలో ఈ కిశోర్ ఒకరు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లి.. ఈవీఎం మిషన్లు ధ్వంసం చేయటం.. దాడికి పాల్పడిన ఉదంతానికి సంబంధించిన వీడియోలు బయటకు రావటం అప్పట్లో సంచలనంగా మారింది.

దీనికి సంబందించిన కేసులతో మే 22న పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ కు పారిపోయారు. అప్పటి నుంచి వారి అనుచరులు సైతం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. తర్వాత పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్ తీసుకొని బయటకు రావటం తెలిసిందే.ఇదిలా ఉంటే.. తురకా కిశోర్ విషయానికి వస్తే.. గడిచిన ఆర్నెల్లుగా బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసే శ్రీకాంత్ అనే వ్యక్తి (సోదరుడిగా చెబుతున్నారు) వద్ద ఉన్నట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ లో పిన్నెల్లిని కలిసేందుకు కిశోర్ వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న విజయపురి సౌత్ పోలీసుల టీం రెండురోజుల క్రితం హైదరాబాద్ కు చేరుకుంది.

ఆదివారం తురకా కిశోర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే మాచర్లకు తీసుకొచ్చి.. ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు (సోమవారం) కోర్టులో హాజరుపరుస్తారనిచెబుతున్నారు. కిశోర్ మీద మూడు హత్యాయత్నాలతో పాటు.. మరో ఏడు కేసులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నిలక వేళలో మాచర్ల నియోజకవర్గం పరిధిలో టీడీపీ.. జనసేన తరఫున నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటంతో పాటు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగేవాడన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై పార్టీ పరిశీలకులుగా వచ్చిన టీడీపీ నేతలు బొండా ఉమ.. బుద్ధా వెంకన్నల కారు మీద దాడికి పాల్పడిన ఉదంతంలో తురకా కిశోర్ కీలకపాత్ర పోషించినట్లుగా చెబుతారు. కారు అద్దాల్లో నుంచి పెద్ద కర్రలతో కిశోర్ దాడి చేయటంతోపాటు.. వారిద్దరూ తీవ్రంగా గాయపడటంలో కిశోర్ ప్రధాన పాత్రగా చెబుతున్ానరు. అంతేకాదు.. 2022లో డిసెంబరు పదహారును టీడీపీ కార్యాలయాన్ని దహనం చేశారు. ఈ ఘటనలోనూ కిశోర్ కీలక నిందితుడిగా ఉన్నారు. టీడీపీనేతలు.. కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి బంగారం.. డబ్బు దోచుకెళ్లిన ఉదంతంలోనూ కిశోర్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. తరచూ అతడి నోటి నుంచి.. తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎవడో ఒకడిని చంపితే కానీ అందరికీ భయం ఉండదన్న మాటలు వచ్చేవని చెబుతారు. మరి.. పోలీసుల విచారణలో ఆయనేం చెబుతారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News