బీఆర్‌ఎస్ తరఫున ఆ నియోజకవర్గం నుంచి విజయశాంతి!
ఈ క్రమంలో ఆల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి పేరు మల్కాజిగిరి స్థానానికి వినిపిస్తోంది. ఈమె మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ మొత్తం 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా మరో నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో మల్కాజిగిరి స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు సీటు లభించింది.
అయితే మైనంపల్లి తనకే కాకుండా తన కుమారుడికి కూడా సీటు (మెదక్ నుంచి) కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన కేసీఆర్ మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన అంతు చూసేవరకు వదలబోనని.. సిద్ధిపేటలో హరీశ్ పతనం చూస్తానని మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సిద్ధిపేటను అభివృద్ధి చేసుకుని మల్కాజిగిరిని కీప్ లాగా చూస్తున్నాడని హరీశ్ పై మండిపడ్డారు.
మైనంపల్లి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. మరోవైపు మైనంపల్లిపై బీఆర్‌ఎస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి సీటును వేరే వారికి కేటాయిస్తారని అంటున్నారు.
ఈ క్రమంలో ఆల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి రెడ్డి పేరు మల్కాజిగిరి స్థానానికి వినిపిస్తోంది. ఈమె మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు. 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్వాల్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మేయర్ పదవి కోసం గట్టిగా పోటీపడ్డప్పటికీ ఈ పదవిని బీఆర్‌ఎస్ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు కేకే కుమార్తె విజయలక్ష్మికి కట్టబెట్టారు.
ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావును బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరించే అవకాశం కనిపిస్తుండటంతో మల్కాజిగిరిలో విజయశాంతి రెడ్డిని పోటీ చేయించొచ్చని చెబుతున్నారు. ఉన్నత విద్యావంతురాలు కావడం, బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడం, అందులోనూ మహిళ కావడం విజయశాంతికి కలిసి వస్తాయని అంటున్నారు.
మరోవైపు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి కూడా మల్కాజిగిరి సీటు కోసం పోటీపడుతున్నారు. ఈ విషయంలో మల్లారెడ్డి.. కేసీఆర్ ను ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. మైనంపల్లి లాంటి ఆర్థికంగా బలవంతుడైన నేతను ఢీకొట్టాలంటే తన అల్లుడు వల్లే అవుతుందని మల్లారెడ్డి చెబుతున్నట్టు సమాచారం.
అయితే కేసీఆర్ ఆలోచన మరోలా ఉందని అంటున్నారు. విజయశాంతికి మల్కాజిగిరి సీటు ఇచ్చి మల్లారెడ్డి అల్లుడిని మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని ఆలోచనలో ఉన్నారని టాక్.
మరోవైపు తన వ్యాఖ్యలను ఏమాత్రం వెనక్కి తీసుకోని మైనంపల్లి ఇంకా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తన కుమారుడికి కూడా సీటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడు పోటీ చేయడం ఖాయమనే చెబుతున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.