ఏపీలో రెండు పార్టీలు బీజేపీలో విలీనం : ఈ జోస్యం ఎవరిది ?

ఇక జనసేన పార్టీ ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉందని ఆ పార్టీ కూడా విలీనం అవుతుందని విజయసాయిరెడ్డి అన్నారు.

Update: 2024-05-10 16:52 GMT

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఏపీలో రెండు పార్టీలు బీజేపీలో విలీనం అవుతాయని వైసీపీ కీలక నేత వి విజయసాయిరెడ్డి సంచలన జోస్యం చెప్పారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు పాతిక ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకుని తాము పోటీ చేస్తున్నామని, జనాల స్పందన చూస్తే తమ లక్ష్యం సంపూర్ణంగా సాధించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

ఏపీలో మరోసారి వైసీపీ చరిత్ర సృష్టించే మెజారిటీతో అధికారంలోకి రానుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల తరువాత తెలుగుదేశం అన్న పార్టీ ఉండదని ఆ పార్టీ బీజేపీలో విలీనం కావడం తధ్యమని ఆయన జోస్యం చెప్పారు. ఇక జనసేన పార్టీ ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉందని ఆ పార్టీ కూడా విలీనం అవుతుందని విజయసాయిరెడ్డి అన్నారు.

దాంతో ఏపీలో 2024 ఎన్నికల అనంతరం అధికారంలో వైసీపీ ఉంటే విపక్షంలో బీజేపీ ఉంటుందని ఈ రెండు పార్టీలు మాత్రమే మిగులుతాయని ఆయన అన్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ చరిత్రలో కలసిపోతుందని అన్నారు. బీజేపీ మతతత్వ పోకడలను ఏపీలో ఎవరూ సమర్ధించరని అందువల్ల బీజేపీకి ఏపీలో ఎప్పటికీ ఎదుగుదల ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఇక రాజ్యసభలో ఉన్న మొత్తం 11 ఎంపీ సీట్లను వైసీపీ సాధించి అక్కడ టీడీపీకి చోటు లేకుండా చేసిందని లోక్ సభలో కూడా ఈసారి టీడీపీకి చాన్స్ ఉండకపోవచ్చు అని చెప్పుకొచ్చారు. అలాగే అసెంబ్లీలో కూడా టీడీపీకి ప్రాతినిధ్యం ఉండదని టీడీపీ అన్న పార్టీని నడపలేరని కూడా అంటున్నారు. మొత్తం మీద ఏపీలో రెండు పార్టీలు బీజేపీలో విలీనం కావడం తధ్యమని విజయసాయిరెడ్డి అంటున్నారు.

మరో వైపు చూస్తే ఎన్నికల అనంతరం విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తారు అని ఆయన ప్రకటించారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని, అలాగే కర్నూలులో హైకోర్టు ని తరలించడం ద్వారా న్యాయ రాజధానిగా చేస్తామని అన్నారు. కర్నూలులో హైకోర్టు అన్నది బీజేపీ అజెండా కూడా అని ఆయన చెప్పారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదాను సాధిస్తామని ఆయన చెప్పారు.

దేశంలో చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అన్నది శాశ్వత ప్రాతిపదికగా ఉందని ఆయన అన్నారు. ఏపీని ఈ విషయంలో కేంద్రం మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న అజెండా అయితే వైసీపీ వద్ద ఉందని దాని ప్రకారం రానున్న కాలంలో ఏపీని ప్రగతిపధంలో నడిపిస్తామని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా, షర్మిల రాజకీయ ప్రస్థానంలో అనేక తప్పులు చేశారని ఆయన అన్నారు. ఆమె మొదట తెలంగాణాలో పార్టీని పెట్టి అక్కడ కొంతకాలం ఉంటూ తిరిగి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి వచ్చారని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అని పీసీసీ చీఫ్ గా ఆమె ఉన్నారని అయితే వైఎస్సార్ ఆశయం అయిన ఉమ్మడి ఏపీని రెండుగా విభజించి ఏపీకి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ లో చేరడం ద్వారా ఆమె వైఎస్సార్ ఆశయాలను అభిమానుల అభిమతాన్ని సైతం మరిచారని ఆయన విమర్శించారు.

మొత్తం మీద చూస్తే ఏపీలో వైసీపీ విజయం పట్ల పూర్తి విశ్వాసంతో విజయసాయిరెడ్డి ఉన్నారని అంటున్నారు. అంతే కాదు కూటమి కట్టి ఎంతమంది వచ్చినా కూడా ఏపీలో వైసీపీ విజయం తధ్యమని చరిత్రను మరోసారి తిరగరాస్తామని కూడా ఆయన అంటున్నారు.

Tags:    

Similar News