నెల్లూరు లోక్ సభ నుంచి విజయసాయిరెడ్డి పోటీ....!
వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్ధిగా విజయసాయిరెడ్డి పోటీ అంటే నెల్లూరు రాజకీయంలో వైసీపీ అల్టిమేట్ పావులనే కదిపింది అనుకోవాలి.
వైసీపీలో కీలక నేత రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు. ఈ మేరకు వైసీపీ శుక్రవారం రాత్రి రిలీజ్ చేసిన తొమ్మిదవ జాబితాలో ఆయన పేరు కనిపించింది. ఇది అనూహ్యమైన ఎంపిక అని అంటున్నారు. వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్ధిగా విజయసాయిరెడ్డి పోటీ అంటే నెల్లూరు రాజకీయంలో వైసీపీ అల్టిమేట్ పావులనే కదిపింది అనుకోవాలి.
ఇప్పటిదాకా వినిపించిన పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ ఏడాది ఏప్రిల్ 2 తో పూర్తి కావస్తోంది. ఆయన తన సతీమణి ప్రశాంతిరెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని పార్టీకి దూరం అయ్యారు. ఆయన టీడీపీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారు అని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వేమిరెడ్డికి పోటీగా ఎవరిని నిలపాలి అని వైసీపీ అనేక చర్చలు జరిపిన మీదట విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డి పేరు తెర మీదకు వచ్చింది.
ఆయనే ఇక అభ్యర్థి అని అంతా అనుకుంటున్న నేపధ్యంలో ఏమైందో ఏమో సడెన్ గా విజయసాయిరెడ్డి పేరుని వైసీపీ అధినాయకత్వం తెర మీదకు తెచ్చింది. ఆయనకు ఖరారు చేసేసింది. రాజకీయ వ్యూహ నిపుణుడిగా విజయసాయిరెడ్డి పెట్టింది పేరు. ఆయన సేవలను పార్టీ ఈ ఎన్నికల్లో కొన్ని రీజియన్స్ లో ఉపయోగించుకుంటుంది అని అంతా భావించారు.
ఆయనకు గుంటూరు పల్నాడు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. అయితే ఇపుడు ఆయన్నే ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా తన నిన్నటి సహచరుడు వేమిరెడ్డిని ఢీ కొట్టబోతున్నారు. నెల్లూరులో చూస్తే వైసీపీకి కొంచెం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి. వరసబెట్టి కీలక నేతలు అంతా పార్టీని వీడుతున్నారు. అదే టైం లో పార్టీకి గతసారి కంటే ఇపుడు కొంత ఎదురీత తప్పదు అని అంటున్నారు.
ఇటువంటి నేపధ్యంలో నెల్లూరు ఎంపీ ఎవరు అన్నదే ఆసక్తికరంగా చూశారు. ఎంపీ అభ్యర్ధి సరైన వారిని పెడితే కచ్చితంగా అసెంబ్లీ పరిధిలో కూడా గెలుపు ఖాయం అని అంతా లెక్క కట్టారు. దాంతోనే విజయసాయిరెడ్డి వంటి వ్యూహకర్తను వైసీపీ దించుతోంది అని అంటున్నారు. విజయసాయిరెడ్డి నెల్లూరు వాసి కావడం కూడా ప్లస్ పాయింట్. దాంతో ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపుతోంది. వైసీపీలో పదేళ్ల క్రితమే విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రచారం జరిగింది. అదిపుడు నిజం కాబోతోంది. మరి వేమిరెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డి అంటే ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తిని రేపుతోంది.