వినేశ్ ఫోగట్ ...హర్యానా రాజకీయాలను మార్చేస్తారా ?
నిజంగా ఆమె బంగారు పతకం తెచ్చినా ఇంతటి మద్దతు దక్కి ఉంటుందా అన్న సందేహం అయితే ఉంది.
రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఈ పేరు పారిస్ ఒలింపిక్స్ లో ఒక్కసారిగా మారుమోగింది. ఆమె తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయింది. బరువు కొన్ని గ్రాములు ఎక్కువ ఉందని చివరి నిముషంలో పోటీ నుంచి తప్పించారు దాంతో రెజ్లర్ వినేశ్ ఫోగట్ కి 143 కోట్ల భారతీయులు అంతా మద్దతుగా నిలిచారు. ఆమెనే అసలు విజేత అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి దేశంలోని ప్రముఖులు వివిధ రాష్ట్రాల ప్రముఖులు క్రీడా ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన వారు అంతా ఆమెకు పూర్తి మద్దతు ని ప్రకటించారు.
నిజంగా ఆమె బంగారు పతకం తెచ్చినా ఇంతటి మద్దతు దక్కి ఉంటుందా అన్న సందేహం అయితే ఉంది. అంతలా ఆమె దేశంలో ఒక్క సారిగా మారుమోగారు. అలాంటిది ఆమె ఇపుడు హర్యానా ఎన్నికల నేపథ్యంలో మరోసారి వార్తలలోకి వస్తున్నారు. హర్యానాలో కొద్ది నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.
అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ ఖట్టర్ తన పదవిని రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరారు. ఇక్కడ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక చూస్తే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మంచి ఫలితాలు ఈ రాష్ట్రంలో వచ్చాయి. ఎన్నికల్లో గెలుపోటములలో ప్రముఖ పాత్ర పోషించే సామాజిక వర్గం జాట్లు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు కాంగ్రెస్ కి లోక్ సభ ఎన్నికల నాటికే మద్దతుగా నిలిచారు. ఇపుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారు అని అంటున్నారు.
జాట్లు బీజేపీ పట్ల కోపంగా ఉండడం ఎందుకు అంటే రాజకీయంగా వారికి సరైన అవకాశాలు ఇవ్వలేదని అంటున్నారు. జాట్లకు సీఎం పదవి ఇవ్వలేదు బీజేపీ. అలాగే 2019 నుంచి 2024 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క జాట్ నాయకుడికీ కంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో వారంతా ఔట్ రేట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉంటున్నారు.
దాంతో పాటు రైతులు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. అలా లోక్ సభ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే కాంగ్రెస్ మొత్తం 42 గ్రామీణ ప్రాంతాలలో మెజారిటీ సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉండే హర్యానాలో ఇది కాంగ్రెస్ కి అధికారానికి దగ్గర చేసే నంబర్ గానే చూస్తున్నారు.
ఇక రెజ్లర్ల మీద లైంగిక వేధింపులు అన్న ఇష్యూ దేశంలో ఆ మధ్య కీలకంగా మారింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విషయంలో కేంద్రం కొంత మెతక వైఖరి చూపించింది అన్న విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పి ముందుండి నిరసనలు చేసింది వినేశ్ ఫోగట్ అని అంటున్నారు. అప్పట్లో ఆ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది.
దాంతో వినేశ్ ఫోగట్ కనుక రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇటీవల ఆమెను మీడియా ఇదే విషయం మీద ప్రశ్నిస్తే తాను ఇంకా పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ చేజారడం మీదనే షాక్ తో ఉన్నాను అని చెప్పారు. అయితే తాను ఎపుడు ఏమి చేయాలో చేస్తాను అని చెప్పారు. దాంతో ఆమె రాజకీయ రంగ ప్రవేశం మీద ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఆమె రెజ్లర్ల మీద లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రముఖంగా మారారు. ఇపుడు ఒలిపింక్స్ లో చివరి దాకా వచ్చి షాక్ కి గురి అయ్యారు. దాంతో పాటు ఆమెకు కాంగ్రెస్ నుంచి మద్దతు ఉంది. అదే సమయంలో పోటా పోటీగా ఉన్న హర్యానా రాజకీయాల్లో ఆమె కనుక కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకుంటే కచ్చితంగా అది బీజేపీకి శరాఘాతం అవుతుంది అని అంటున్నారు. ఈ విధంగా పారిస్ ఒలింపిక్స్ లో పతకం చేజార్చుకున్నా కూడా వినేశ్ ఫోగట్ హర్యానా రాజకీయాల్లో మాత్రం గేం చేంజర్ గా మారుతారు అని అంటున్నారు. ఆమె తొందరలోనే తన నిర్ణయం ప్రకటించి సంచలనం సృష్టిస్తారు అని అంటున్నారు.