రాజమండ్రి ప్రభుత్వ అసుపత్రిలో వీఐపీ గది సిద్ధం?

క్యాజువాలిటీ పక్కనున్న వీఐపీ గదికి వెళ్లే మార్గం అంతా హడావుడిగా శుభ్రం చేయించారని.. అదేవిధంగా గదిలో రెండు ఆక్సిజన్‌ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్‌, వెంటిలేటర్‌ లతోపాటు వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Update: 2023-10-14 04:22 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో 34 రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో శుక్రవారం మొత్తం ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమయ్యింది. దీంతో... గత రాత్రి జైళ్ల శాఖ డీఐజీ దీనిపై పూర్తి వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలిపారు. తప్పుడు వార్తలు అందిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.

ఆ సంగతి అలా ఉంటే... ఆయనను ఏ క్షణమైనా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందనే చర్చ స్థానికంగా నెలకొంది! దానికి కారణం... రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని వీఐపీ గదిని అధికారులు అత్యవసరంగా శుక్రవారం అర్ధరాత్రి శుభ్రం చేయించడమే అని అంటున్నారు. దీంతో బాబును ఆసుపత్రికి తరలిస్తున్నట్లున్నారనే చర్చ మొదలైందని అంటున్నారు.

క్యాజువాలిటీ పక్కనున్న వీఐపీ గదికి వెళ్లే మార్గం అంతా హడావుడిగా శుభ్రం చేయించారని.. అదేవిధంగా గదిలో రెండు ఆక్సిజన్‌ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్‌, వెంటిలేటర్‌ లతోపాటు వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో... ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులను కేటాయించి, వీరు శుక్రవారం రాత్రి నుంచే అందుబాటులో ఉండేలా చూసుకున్నారని చెబుతున్నారు.

ఇదే సమయంలో నైట్ డ్యూటీలో ఉండే అన్ని అత్యవసర విభాగాలకూ మెసేజ్ లు అందాయని కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో... రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబుని ఏక్షణమైనా ఆసుపత్రికి తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయనే గాసిప్స్ తెగ వైరల్ అయ్యాయని తెలుస్తుంది. అయితే... ఇది అత్యంత సాధారణ విషయం అని, ఇది ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చేపట్టే రొటీన్ ప్రొసీజర్ అని మరికొందరు కొట్టిపారేస్తున్నారు.

కాగా... రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు గత రెండు రోజులుగా స్కిన్ అలర్జీ, డీహైడ్రేషన్ తో బాదపడుతున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వరుసగా రెండు రోజులు హెల్త్ బులిటెన్ లు విడుదల చేశారు. ఇదే సమయంలో.. విలేకరుల సమావేశం నిర్వహించిన జైలు అధికారులు... చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వద్దని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.

మరోపక్క చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని, ఆయనకు స్టెరాయిడ్స్ ఇవ్వాలని చూస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అటు ప్రభుత్వ పెద్దలు, అధికారులు సీరియస్ గా స్పందించారు. చంద్రబాబు బరువు పెరిగారని, వచ్చినప్పటికంటే ఒక కిలో పెరిగారని జైలు అధికారులు స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అదే సమయంలో చర్మ సమస్య చంద్రబాబుకు జైలుకు వచ్చిన తర్వాత రాలేదని, అంతకముందునుంచే ఉందని వైసీపీ నేతలు గుర్తుచేశారు. జైలులో వాటర్ శుభ్రమైనది కాకపోతే చంద్రబాబుకు మాత్రమే కాదని.. ఆయనతోపాటు రెండువేలకు పైగా ఉన్న ఖైదీలందరికీ కూడా చర్మ సమస్య వచ్చేదని.. కానీ, అలాంటిదేమీ లేదని తెలిపారు. పైగా ఇంటినుంచి వస్తోన్న భోజనం తింటున్న చంద్రబాబు బరువు తగ్గుతున్నారంటే... భువనేశ్వరే సమాధానం చెప్పాలని సూచించారు!

Tags:    

Similar News