విశాఖ ఎంపీగా పక్కా లోకల్ క్యాండిడేట్...?

విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధులు ఎవరూ రాజకీయ పార్టీలకు కనిపించడంలేదా అని ప్రశ్నిస్తోంది

Update: 2023-08-14 14:30 GMT

విశాఖ నుంచి పక్కా లోకల్ అభ్యర్ధినే బరిలోకి దించాలని విశాఖలోని మేధావులు విద్యావంతులు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో తాజాగా నిర్వహించిన రౌండ్ టేబిల్ సమావేశంలో వారు మాట్లాడుతూ గడచిన మూడు దశాబ్దాలుగా విశాఖలో నాన్ లోకల్స్ నే ఎంపీలుగా నిలబెడుతున్నారని, జనాలు సైతం గత్యంతరం లేక వారినే గెలిపిస్తున్నారని అన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలూ నాన్ లోకల్స్ నే పోటీకి అభ్యర్ధులుగా నిర్ణయించడం పట్ల రౌండ్ టేబిల్ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.

విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధులు ఎవరూ రాజకీయ పార్టీలకు కనిపించడంలేదా అని ప్రశ్నిస్తోంది. 1991 నుంచి విశాఖ వలల రాజకీయ నాయకులకు అడ్డాగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో వరసబెట్టి నాన్ లోకల్స్ ఎంపీలు కావడం వల్ల అభివృద్ధి కుంటుబడుతోందని, స్థానిక అంశాలు డిమాండ్లకు కూడా విలువ లేకుండా పోయిందని అంటున్నారు.

దీని మీద మాజీ వీసీ ఆచార్య కే ఎస్ చలం మాట్లాడుతూ గడచిన మూడు దశాబ్దాల కాలంలో విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఏకంగా ముప్పయి లక్షల మంది దాకా యువత ఉపాధిని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారని అన్నారు. అలాగే వలస రాజకీయ నాయకుల మూలంగా ఉత్తరాంధ్రాలో ఇరవై లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కబ్జాకు గురి అయ్యాయని ఆరోపించారు.

విశాఖ అభివృద్ధి కోసం ఎవరూ ఏమీ చేసింది లేదని కూడా మండిపడ్డారు. అందువల్ల ఈసారి ఎన్నికల్లో పార్టీలు అన్నీ కలసి లోకల్ క్యాండిడేట్స్ ని పోటీకి పెట్టాలని రౌండ్ టేబిల్ సమావేశం డిమాండ్ చేసింది. విశాఖలో స్థానికులలో ప్రతిభావంతులు ఉన్నారని, అలాగే ఎందరో సమర్ధులు ఉన్నారని వారు అంటున్నారు.

ఇదిలా ఉండగా విశాఖ నుంచి 1984లో భాట్టం శ్రీరామమూర్తి చిట్ట చివరి లోకల్ ఎంపీగా చెప్పుకోవాలి. ఆయన 1989లో పదవీ విరమణ చేసిన తరువత గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో తొమ్మిది మంది ఎంపీలు వివిధ పార్టీల నుంచి నెగ్గారు. అయితే వారంతా నాన్ లోకల్స్ గానే ఉన్నారు.

ఎక్కడో ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు రావడం పోటీ చేసి పదవులు పొందడం తప్ప స్థానికంగా చేసినది ఏమీ లేదని ప్రజల మనోవేదనగా ఉంది. అయితే మరో వైపు ఇంకో వాదన కూడా ఉంది విశాఖ ఆసియా ఖండంలోనే శరవేగంగ ఏదుగుతున్న నగరం. ఒక విధంగా చెప్పాలంటే మినీ ఇండియాగా అనుకోవచ్చు. అలాంటి చోట నాన్ లోకల్ అన్న మాటకు అర్ధం ఉంటుందా అని అంటున్న వారూ ఉన్నారు.

అయితే విశాఖకు దశాబ్దాలు గడచినా రైల్వే జోన్ అన్నది సాకారం కాకపోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి కనీసంగా డిమాండ్ చేయకపోవడం ఎంతో అభివృద్ధికి ఆస్కారం ఉన్న విశాఖ విషయంలో ఉదాశీనంగా ఉండడం వంటివి చూసిన వారు లోకల్ లీడర్ అయితే ఎంతో కొంత ఇవన్నీ ముందుకు వెళ్లేవే అని అంటూంటారు. మరి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి లోకల్ కార్డుతో ప్రజా సంఘాల నేతలు, మేధావులు ముందుకు వస్తున్నారు మరి వీరి డిమాండ్లను రాజకీయ పార్టీలు ఎంతవరకూ పట్టించుకుంటాయన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News