ప్రిగోజిన్ విమానంలో బాంబు.. తెరపైకి నమ్మకద్రోహం వీడియో!
అవును.. ప్రిగోజిన్ ది ప్రమాదం కాదని, అతడిని హత్య చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది
రష్యా వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్.. విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం పట్ల పను అనుమానాలు తెరపైకి వస్తోన్న నేపథ్యంలో తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో తమ అంచనాను బలపరిచేలా ఉన్న వీడియోను వైరల్ చేస్తుందని తెలుస్తోంది.
అవును.. ప్రిగోజిన్ ది ప్రమాదం కాదని, అతడిని హత్య చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. కూలిపోవడానికి ముందే విమానంలో భారీ పేలుడు జరిగి ఉంటుందని పేర్కొంది. ఇదే క్రమంలో క్షిపణిని ఉపయోగించి విమానాన్ని కూల్చేశారనే వాదనను అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కొట్టిపారేశాయి.
ఈ మేరకు పెంటగాన్ ప్రతినిధి పాట్ రైడర్... విమానంలో పేలుడు వల్ల ప్రిగోజిన్ మరణించి ఉంటాడని పేర్కొన్నారు. మరో వైపు వాగ్నర్ కు చెందిన గ్రేజోన్ టెలిగ్రామ్ ఛానల్ ప్రిగోజిన్ ది ప్రమాదం కాదని, హత్యగానే చెబుతోంది. వీటికి బలం చేకూరుస్తూ... ప్రత్యక్ష సాక్షులు రెండు పేలుళ్లను విన్నట్లు గార్డియన్ పత్రిక కథనంలో పేర్కొంది.
ఇక్కడ మరో క్లిష్టమైన ప్రశ్న ఏమిటంటే... సాధారణంగా సైనిక దళాల టాప్ లీడర్లు ఒకే విమానంలో ఎప్పుడూ ప్రయాణం చేయరని అంటారు. కానీ... అందుకు పూర్తి విరుద్ధంగా ఇక్కడ వాగ్నర్ గ్రూపులోని కీలక నాయకులంతా ఒకే విమానంలో ఎందుకు బయల్దేరారన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఆ సంగతి అలా ఉంటే... ప్రిగోజిన్ ప్రయాణించిన విమాన తయారీ సంస్థ కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలానే వ్యాఖ్యానించింది. ఇందులో భాగంగా... ప్రిగోజిన్ ప్రయాణించిన ఎంబ్రాయర్ లెగస్సీ 600 జెట్ లో ప్రమాదం ముందు వరకు ఎటువంటి సమస్యను గుర్తించలేదని పేర్కొంది.
ఇదే సమయంలో గత 20 ఏళ్లలో ఈ రకం విమానాల్లో జరిగిన రెండో ప్రమాదం ఇదని వెల్లడించింది.
వైరల్ అవుతున్న పుతిన్ వీడియో:
ప్రిగోజిన్ మృతిపై ఇప్పటికే పలువురు పుతిన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో... "నేను దేనినైనా క్షమిస్తాను. కానీ.. నమ్మక ద్రోహాన్ని మాత్రం క్షమించను" అని పుతిన్ వ్యాఖ్యానించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వాగ్నర్ తిరుగుబాటును పుతిన్ వెన్నుపోటు, రాజద్రోహంగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
సరిగ్గా రెండు నెలలకు...:
యాదృశ్చికమో.. కాకతాలీయమో తెలియదు కానీ... ప్రిగోజిన్ రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన సరిగ్గా అరవై రోజులకు ఎవరూ ఊహించని విధంగా విమాన ప్రమాదంలో మృతి చెందాడు.
అవును... జూన్ 23వ తేదీన ప్రిగోజిన్ రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దానిని ఉపసంహరించుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్ తో రాజీపడ్డారు. ఈ ఘటనకు సరిగ్గా రెండు నెలలు పూర్తయిన (ఆగస్టు 23న) సమయంలో ప్రిగోజిన్ విమానం కూలి మరణించారు.
వాగ్నర్ నెక్స్ట్ బాస్:
ప్రిగోజిన్ మరణంతో వాగ్నర్ నెక్స్ట్ బాస్ ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... వాగ్నర్ సైన్యం పగ్గాలు "సిడాయ్" అనే కాల్ సైన్ పేరిట పాపులర్ అయిన ఆండ్రీ ట్రోషేవ్ చేతికి వెళ్లవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ ఇంటెలిజెన్స్ సంస్థ మాజీ సభ్యుడు క్రిస్ స్టీలే ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు.