తెలంగాణలో నెలలో పెరిగిన ఓట్లు.. 4.71 లక్షలు

ఇందుకు తగ్గట్లే.. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. కేవలం నెల వ్యవధిలో 4.71 లక్షల ఓట్లు పెరగటం ఆసక్తికరంగా మారింది.

Update: 2023-11-04 12:30 GMT

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకోవటానికి తెలంగాణ అధికారపక్షం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంటే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా అధికారాన్ని సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ తపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో హంగ్ ఖాయమని.. కీ రోల్ పోషించాలని బీజేపీ భావిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నికల నేపథ్యంలో ఓటు మీద తెలంగాణ ప్రజల్లో ఆసక్తి ఎక్కువగా వ్యక్తమవుతోంది.

ఇందుకు తగ్గట్లే.. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. కేవలం నెల వ్యవధిలో 4.71 లక్షల ఓట్లు పెరగటం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను అధికారులు చేపట్టారు. గత నెలలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. దీని ప్రకారం 3.17 కోట్ల ఓటర్లుగా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు గడువు అక్టోబరు 31న ముగిసింది. ఇదే సమయంలో కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవటానికి.. మార్పులకు.. చేర్పులకు.. తొలగింపులకు సంబంధించి అప్లికేషన్లను స్వీకరించారు. దీనికి స్పందన ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో నెల వ్యవధిలో వివిధ అంశాలకు సంబంధించి 10 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయి. దీంతో.. ఎన్నికల జాబితా నుంచి తొలగింపుల ప్రక్రియను గత నెల పది నుంచి ఆపేశారు.

కేవలం ఓటర్ నమోదు దరఖాస్తుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని.. వాటిల్లో అర్హులకు ఓటుహక్కును కల్పించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అప్లికేషన్లను పూర్తి చేయగా.. మిగిలిన ఓటర్ నమోదు అప్లికేషన్లను ఈ నెల పది నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు. గడిచిన నెల వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా 4,71,421 ఓట్లు అదనంగా నమోదయ్యాయి. దీనికి సంబంధించిన ప్రత్యేక సవరణ జాబితాను వెల్లడించారు.

తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లను చూస్తే.. అందులో 30-60 సంవత్సరాల వయస్కులే అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తంఓటర్లలో పురుషులు 1.60కోట్లు కాగా మహిళలు సైతం 1.60కోట్లే. ఇతరులు 2,583 మంది. స్త్రీ.. పురుష ఓటర్ల మధ్య తేడా కేవలం 8 వేల ఓట్లు మాత్రమే. సర్వీసు ఓటర్లు 15,395. మొత్తం ఓటర్లలో 30-40 మధ్య 1,00,22,566 మంది ఉండగా.. 41-60 మధ్య వయస్కులు 1,08,03,759 మంది ఉన్నారు. 60 ఏళ్ల వయసు దాటిన వారు 41,93,534 మంది ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News