మా పార్టీ టికెట్ కోసం.. నేతలు క్యూ కట్టారు: జేడీ వారి క్యామెడీ!
అంతేనా.. అక్కడితో కూడా జేడీ వారు ఆగలేదు. ''మా పార్టీ టికెట్ కోసం.. నాయకులు క్యూకట్టారు
ఎన్నికల వేళ కొత్తగా ఆవిర్భవించిన జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు క్యామెడీని తలపించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ''మా పార్టీలో చేరేందుకు.. నాయకులు రెడీగా ఉన్నారు. మేమే ఎవరిని చేర్చుకోవాలా? అని ఆలోచిస్తున్నాం. మేం ఒక్కసారి ఓకే అంటే.. చాలా మంది నాయకులు వచ్చేస్తారు'' అని వ్యాఖ్యానించారు.
అంతేనా.. అక్కడితో కూడా జేడీ వారు ఆగలేదు. ''మా పార్టీ టికెట్ కోసం.. నాయకులు క్యూకట్టారు. మాకు కావాలంటే.. మాకు కావాలంటూ.. పోటీ పడుతున్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాం. రెండు మూడు రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరదించేస్తాం. మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్తులను నిలబెడుతున్నాం. ఇది కొన్ని కొన్ని పార్టీలకు కూడా సాధ్యం కాలేదు. మాకు మాత్రమే సాధ్యమైంది'' అని జేడీ వారు ముక్తాయించారు.
అంతేకాదు.. ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందో తాము అధికారంలోకి వచ్చాక చూపిస్తామని జేడీ చెప్పారు. త్వరలోనే రెండు మూడు రోజుల్లోగా తమ మేనిఫెస్టోను ప్రజాక్షేత్రంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి వేదికను రెడీ చేసుకుంటున్నామన్నారు. ప్రత్యేక హోదా సాధన, అభివృద్ధే ప్రధానంగా ఉపాధి, రైతుల సంక్షేమం కోణంలో తమ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. దీనిని తాము ఎవరి నుంచి కాపీ కొట్టి రూపొందించలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు జేడీ సమాధానం చెప్పారు. ఏదేమైనా.. జేడీ వారి పార్టీకి ఇంత డిమాండ్ ఉంటుందని బహుశ ఎవరూ ఊహించి ఉండరు. చూడాలి.. మరి ఏ రేంజ్‌లో చేరతారో.. ఎన్ని టికెట్లు ఇస్తారో.. అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.