లెబనాన్ లో పేలుళ్లు: నిన్న పేజర్లు.. నేడు వాకీటాకీలు

ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి పోతోంది లెబనాన్. వరుస పెట్టి జరుగుతున్న పరిణామాలకు లెబనాన్ బిత్తరపోతోంది.

Update: 2024-09-19 05:00 GMT

ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి పోతోంది లెబనాన్. వరుస పెట్టి జరుగుతున్న పరిణామాలకు లెబనాన్ బిత్తరపోతోంది. నిన్నటికి నిన్న వాకీటాకీలు పేలి.. పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకోవటంతోపాటు వందలాది మంది గాయపడి.. ఆసుపత్రుల్లోచికిత్స పొందుతున్నారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే.. తాజాగా వాకీటాకీలు పేలుతున్న వైనం మరింత షాక్ కు గురి చేస్తోంది. బుధవారం బీరూట్ తో పాటు పలు ప్రాంతాల్లోని వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. వాకీ టాకీలతో పాటు పలు పౌర పరికరాలు సైతం పేలిపోయాయి.

తాజా ఘటనల్లో పద్నాలుగు మంది మరణించగా.. 450 మంది గాయపడ్డారు. ఇజ్రాయెలే ఈ దాడికి పాల్పడినట్లుగా లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. పేజర్ల పేలుళ్లలో ముగ్గురు హెజ్ బొల్లా సభ్యులు.. ఒక బాలుడు మరణించారు. వారి అంత్యక్రియల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు. ఇదే సమయంలో వాకీటాకీలను పేల్చేశారు.

ఇదిలా ఉంటే.. బీరూనట్ లోని తీర ప్రాంతంలోని సిడోన్ లో కారుతో పాటు ఒక షాపులో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. బీరూట్ లోని పలు సోలార్ పరికరాలు పేలిపోయాయి. హెజ్ బొల్లా గ్రూపు వారి చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలు సైతం పేలిపోవటం గమనార్హం. తాజాగా పేలిన వాకీటాకీలు జపాన్ లో తయారైనట్లుగా చెబుతున్నారు. ఈ వాకీటాకీలపై ఐకామ్ అనే పేరుంది. ఐకామ్ అనేది రేడియో కమ్యూనికేషన్స్.. టెలిఫోన్ల కంపెనీ.. లెబనాన్ లో పేలిన వాకీ టాకీల ఉత్పత్తిని తాము ఎప్పుడో ఆపేశామని ఐకామ్ పేర్కొంది. అయితే.. వీటిని ఐదు నెలల క్రితమే హెజ్ బొల్లా కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.

ఇంకోవైపు లెబనాన్ సరిహద్దుల్లోకి భారీగా ఇజ్రాయెల్ తన సైన్యాన్ని తరలిస్తోంది. గాజాతో పాటు ఆక్రమిత వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ ఖాళీ చేయాలన్న డిమాండ్ తో పాలస్తీనా ప్రవేవ పెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదాన్ని తెలిపింది. 193 సభ్య దేశాల్లో 124 దేశాలు అనుకూలంగా ఓటేస్తే.. 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్ లాంటి మరో 43 దేశాలు మాత్రం ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండటం గమనార్హం.

Tags:    

Similar News