భారత్‌ పై ‘వాటర్‌ బాంబ్‌’ కు చైనా సిద్ధం!

ఇందులో భాగంగా అతిపెద్ద నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నదిని చైనా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.

Update: 2024-08-05 06:10 GMT

సరిహద్దుల్లో తన పప్పులు ఉడకకపోవడంతో చైనా బరితెగిస్తోంది. గతం (1962)లో మాదిరిగా భారత్‌ సైనికంగా బలహీనంగా లేదని గ్రహించిన చైనా కొత్త కుయుక్తులు పన్నుతోంది. ప్రకృతితో చెలగాటమాడుతూ భారత్‌ ను నాశనం చేయాలని చూస్తోంది.

ఇందులో భాగంగా అతిపెద్ద నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నదిని చైనా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. హిమాలయాల్లోని మానస సరోవర్‌ ప్రాంతంలో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్‌ లో ప్రవేశించడానికి ముందు చైనాలో ప్రవహిస్తోంది. అక్కడి నుంచి భారత్‌ లో అరుణాచల్‌ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ప్రవహిస్తూ బంగ్లాదేశ్‌ లోకి మళ్లుతోంది. అక్కడ బంగాళాఖాతంలో కలుస్తోంది.

ఈ నేపథ్యంలో బ్రహ్మపుత్రా నదీ చైనాలో ప్రవహిస్తున్న చోట, భారత్‌ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో నదికి కీలకమైన వంపు మార్గంలో చైనా భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని చెబుతున్నారు. దీన్ని సూపర్‌ డ్యామ్‌ గా చైనా అభివర్ణిస్తోంది. ఈ డ్యామ్‌ విషయంలో భారత్‌ జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ హెచ్చరించింది.

బ్రహ్మపుత్ర నదీ కీలక వంపు మార్గంలో డ్యామ్‌ ను నిర్మించి.. భారీ ఎత్తున నీటిని నిల్వ చేసి చెప్పాపెట్టకుండా వదిలేస్తే అరుణాచల్‌ ప్రదేశ్, అస్సోం రాష్ట్రాల్లో భారీ విధ్వంసం తప్పదు. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి.

వాస్తవానికి బ్రహ్మపుత్ర నదికి సంబంధించి చైనా – భారత్‌ మధ్య ఒప్పందం ఉంది. నదీ జలాలు, వరదకు సంబంధించిన సమాచారాన్ని ఇరు దేశాలు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలనేది ఈ ఒప్పంద సారాంశం.

2002లో ఇరు దేశాల మధ్య ఐదేళ్ల కాలానికి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని భారత్‌ –చైనా పంచుకోవాలి. ఆ తర్వాత ఈ ఒప్పందం కాలపరిమితి ముగియడంతో 2008, 2013, 2018ల్లో ఒప్పందాలను పునరుద్ధరించారు. 2023తో తాజా ఒప్పందం గడువు ముగిసింది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండటంతో ఒప్పందం మళ్లీ కుదరలేదు.

ఈ నేపథ్యంలో బ్రహ్మపుత్ర నది చైనా నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ చేరుకోవడానికి ముందు 3000 మీటర్ల లోయలోకి దిగుతోంది. ఆ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ ను చైనా నిర్మించాలని తలపెట్టింది. దీన్ని ‘సూపర్‌ డ్యామ్‌’ అని వ్యవహరిస్తోంది.

ఈ డ్యామ్‌ భారత్‌ కు తీవ్ర ముప్పును కలిగిస్తుంది. డ్యామ్‌ నుంచి చైనా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తే అరుణాచల్‌ ప్రదేశ్‌ లో తీవ్ర వరదలు సంభవిస్తాయి. భారతదేశానికి గణనీయమైన నష్టం కలుగుతుంది.

భారత సరిహద్దు నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ డ్యామ్‌ ఉంటుంది. ఇది ఏ సమయంలోనైనా ‘వాటర్‌ బాంబ్‌‘ మాదిరిగా అధిక మొత్తంలో నీటిని విడుదల చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

చైనా ఈ డ్యామ్‌ ను భారత్‌ ను దెబ్బతీయడానికే నిర్మిస్తుండటంతో దీనివల్ల అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో తీవ్ర విధ్వంసం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ డ్యామ్‌ కు దిగువ ప్రాంతాలకు భయంకరమైన ముప్పు తప్పదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News