కుష్బూ కాదు.. క్యాండిడేట్ ను కన్ ఫాం చేసిన బీజేపీ!

తాజాగా కీలకమైన ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీపై బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నవ్య తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడారు.

Update: 2024-10-20 03:47 GMT

వయనాడ్ లోక్ సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ ఉప ఎన్నికలో ప్రియాంకగాంధీపై ఖుష్బూ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఇలాంటి పుకార్లు సహజమే అని.. అయినా పార్టీ బాధ్యత అప్పగిస్తే తాను దేనికైనా సిద్ధమని ఖుష్బూ ప్రకటించారు.

తనకు అప్పగించిన బాధ్యతకు నూటికీ నూరుశాతం న్యాయం చేస్తామని ఆమె తెలిపారు. దీంతో... ప్రియాంక గాంధీ వర్సెస్ ఖుష్బూ అనే అంశం వయనాడ్ లో రసవత్తరపోరుకు తెరతీయనుందనే చర్చ తీరపైకి వచ్చింది. అయితే... వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంకపై తన అభ్యర్థిని తాజాగా కన్ ఫాం చేసింది బీజేపీ.

అవును... వయనాడ్ లోక్ సభకు జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రాపై పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఆమె పేరు నవ్య హరిదాస్. నవంబర్ 13న జరగబోయే వయనాడ్ బై పోల్స్ లో ప్రియాంక గాంధీతో ఈమె తలపడనున్నారు.

ఎవరీ నవ్య హరిదాస్?:

కాలికట్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కే.ఎం.సీ.టీ. ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన నవ్య హరిదాస్.. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి కోజికోడ్ కార్పొరేషన్ లో రెండుసార్లు కౌన్సిలర్ గా, కార్పొరేషన్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా పనిచేశారు.

ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు 39 ఏళ్ల నవ్య హరిదాస్. ఈమె 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అహమ్మద్ దేవర్కోవిల్ చేతిలో ఓటమిపాలయ్యారు.

తాజాగా కీలకమైన ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీపై బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నవ్య తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... వయనాడ్ ప్రజల అవసరాలను కాంగ్రెస్ తీర్చడం లేదని... ఈ ఎన్నిక నుంచి వయనాడ్ ప్రజల సమస్యలు పరిష్కరించగల మంచి ఎంపీ కావాలని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా.. స్థానిక సమాజం ఆందోళనలకు ప్రాధాన్యతనిచ్చే ప్రతినిధిని కలిగి ఉండటం ముఖ్యమని నొక్కి చెప్పారు. కేరళలో రెండుసార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన తనకు పరిపాలనా అనుభవం ఉందని.. గత ఎనిమిదేళ్లుగా రాజకీయ రంగంలో ఉన్నట్లు తెల్లిపారు.

కాగా... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్ బరేలీ తో పాటు, కేరళ లోని వయనాడ్ లోనూ విజయం సాధించారు. అనంతరం.. వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది.

Tags:    

Similar News