వాలంటీర్ల మీద వేటు....ఎవరికి చేటు...!?
వారంతా ఇప్పటిదాకా ప్రభుత్వ పధకాలను ప్రజలకు నేరుగా చేరవేస్తూ ఒక వారధిగా పనిచేస్తూ వస్తున్నారు.
ఏపీలో దాదాపుగా రెండున్నర లక్షలకు పై చిలుకు వాలంటీర్లు ఉన్నారు. వారంతా ఇప్పటిదాకా ప్రభుత్వ పధకాలను ప్రజలకు నేరుగా చేరవేస్తూ ఒక వారధిగా పనిచేస్తూ వస్తున్నారు. ప్రతీ యాభై కుటుంబాలకు ఒక వాలంటీరు ఉన్నారు.
దీనిని బట్టి చూస్తే ఒక పోలింగ్ బూత్ లో వేయి ఓట్లు ఉంటాయనుకుంటే అక్కడ ఇరవై మంది దాకా వాలంటీర్లు ఉంటారన్నమాట. వాలంటీర్లు మైక్రో లెవెల్ దాకా చొచ్చుకుని పోయారు. వారు ప్రభుత్వాన్ని ప్రజల ఇళ్లలోకి తెచ్చారు. వారు అయిదేళ్ళుగా పనిచేయడంతో ఒక విధంగా ప్రభుత్వానికి అసలైన రూపంగా కనిపిస్తున్నారు.
వారే పెన్షన్లు ఇస్తారు. వారే మొబైల్ రేషన్ సమాచారం ఇస్తారు. వారే అన్ని ప్రభుత్వ పరమైన ప్రకటన గురించి చెబుతారు. అందువల్ల వారితో ప్రజలకు నేరుగా కనెక్షన్ ఉంది. వారిని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వైసీపీకి ఉంది అని అంటారు. అందుకే వారిని ప్రభుత్వంలో కలపకుండా వాలంటీర్లుగా చూపిస్తూ వచ్చింది. వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని ఎన్నో డిమాండ్లు వచ్చినా కూడా వైసీపీ వారి గౌరవ వేతం వేయి రూపాయలు పెంచింది కానీ వారిని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తోంది.
ఎవరు అడిగినా వారు ప్రభుత్వ ఉద్యోగులు కారనే టెక్నినల్ గా ఉంటుంది.వారి గురించి లోకల్ బాడీ ఎన్నికల దాకా విపక్ష రాజకీయ పార్టీలు కూడా ఆలోచించలేదు. కానీ ఆ ఎన్నికల్లో వాలంటీర్లు ప్రభుత్వానికి సాయం చేశారు అన్న ఆరోపణల నేపధ్యంలో అలెర్ట్ అయ్యాయి. ఆనాటి నుంచి వాలంటీర్ల మీద విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో వారి పాత్రను లేకుండా చేయాలని చేసిన అనేక వినతుల మేరకు వారిని ఈసీ కూడా విధులకు దూరం పెట్టమని ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే వారు ఇప్పటికీ ప్రభుత్వ వారధులుగా ఉంటున్నారు. అయితే ఇపుడు ఎన్నికల సీజన్ కాబట్టి ఆయన చోట్ల అధికార పార్టీ అభ్యర్ధులకు ఎన్నికల ప్రచారంలో వారు సహకరిస్తున్నారు అన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. దానితో పాటు ఆధారసహితంగా వీటి మీద ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు
ఈ క్రమంలో ఏపీలో అనేక జిల్లాలలో వాలంటీర్ల మీద వేటు పడుతోంది. వారిని విధుల నుంచి తక్షణ తొలగిస్తున్నారు అలా విశాఖ నుంచి చూసుకుంటే గోదావరి జిల్లాలు రాయలసీమ జిల్లాలలో పదుల సంఖ్యలో వాలంటీర్ల మీద వేటు పడుతోంది. వారిని మాజీలుగా చేసి ఇళ్ళకు పంపిచేస్తున్నారు.
తాజాగా చూస్తే కనుక కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో 11 మంది వాలంటీర్లపై వేటు పడింది. మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. ఈ నెల 17న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఆ విషయం నిర్ధారణ కావడంతో వాలంటీర్ల తొలగింపుపై మైలవరం ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఇదే వరసలో అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోనూ నలుగురు వాలంటీర్లను తొలగించారు. వీరు వైసీపీ కండువాలు, టోపీలు ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు తేలింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉణదుర్రులో 9 మంది వాలంటీర్లపై చర్యలు తీసుకున్నారు. వైసీపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.
వైసీపీ వాలంటీర్లను ఎక్కువగా నమ్ముకుంటోంది. ప్రజలతో వారికే నేరుగా కనెక్షన్లు ఉన్నాయి. దాంతో వారి అవసరం పడుతోంది. దీంతో విపక్షాలు కూడా నిఘా పెట్టి మరీ యాక్షన్ కి డిమాండ్ చేస్తున్నారు. మే 13న ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో ఏప్రిల్ మే నెల పధకాలు పెన్షన్ వంటివి వాలంటీర్లు ద్వారానే అందించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఎన్నికల కోడ్ వచ్చి నాలుగు రోజులు కాకముందే యాభై నుంచి డెబ్బై మంది దాకా వాలంటీర్లు వేటుకు గురి అయ్యారు. ఇదే తీరున చూసుకుంటే రానున్న రోజులలో వేలాది మంది ఇక ఇంటికే వెళ్తారా అన్న డౌట్లు వస్తున్నాయి.
వాలంటీర్లను దూరం పెట్టాలని ఈసీ ఆదేశాలు ఇచ్చినా కూడా వైసీపీ వారు అతి ఉత్సాహంతో వారిని తీసుకుని వెళ్తున్నారు. ఇదే చివరికి వారి కొలువుని కూడా దూరం చేస్తోంది అని అంటున్నారు.