బీఆర్ఎస్ వైసీపీ పరిస్థితి ఏంటి ?
బీఆర్ఎస్ ని తీసుకుంటే 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓటు షేర్ తెచ్చుకుంది.
బీఆర్ఎస్ వైసీపీ రెండూ దొందుకు దొందు గానే ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు పార్టీలకు వెలుగు అంతా గత వైభవంగా మారింది. అధికారానికి దూరమై కష్టాలకు చేరువ అయి అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా ఓటములు గెలుపులు సహజం. కానీ ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ అపరిమితమైన అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ అదే శాశ్వతం అని భ్రమించిన నేపధ్యంలోనే ఇపుడు రెండు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయని అంటున్నారు.
బీఆర్ఎస్ ని తీసుకుంటే 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓటు షేర్ తెచ్చుకుంది. అలాగే 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాంతో మంచి ఫైట్ ఇచ్చారు అన్న భావన వ్యక్తం అయింది. గిర్రున అయిదారు నెలలు తిరిగేసరికల్లా అదే బీఆర్ఎస్ నేల చూపులు చూసింది. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక్క సీటునూ గెలుచుకోకపోవడం ఆ పార్టీ హిస్టరీలోనే ఇదే ప్రధమం. అంతే కాదు బీజేపీ బీఅర్ఎస్ ప్లేస్ ఆక్రమించి కాంగ్రెస్ కి
ఆల్టర్నేషన్ గా నిలిచింది.
బీఆర్ఎస్ ఓటు షేర్ 20 శాతానికి పడిపొతే 35 శాతానికి పైగా ఓటు షేర్ తెచ్చుకుని బీజేపీ సత్తా చాటింది. ఈ నేపధ్యంలో ఎనిమిది మంది ఎంపీలతో తెలంగాణాలో కాంగ్రెస్ ని బీజేపీ ఢీ కొడుతోంది. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం కూడా బీజేపీ రాజకీయంగా పట్టు సాధించేందుకు అవకాశంగా మారింది.
బీఆర్ఎస్ క్యాడర్ చూస్తే ఒక్కసారిగా వీక్ అయింది. కవిత జైలు జీవితం అలా నెలల తరబడి గడుపుతోంది. ఏడు పదుల వయసులో ఉన్న కేసీఆర్ ఆరోగ్య సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక కేటీఅర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నారని ప్రచారం అయితే సాగుతోంది. దీని మీద కాంగ్రెస్ నేతలు కూడా సీరియస్ గానే దృష్టి పెట్టారు. మొత్తానికి చూస్తే బీఆర్ఎస్ ప్రస్థానం అంతా ఇపుడు కలగా మారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా కనిపిస్తోంది అని అంటున్నారు.
ఏపీలో వైసీపీ సీన్ చూసినా డిటో అన్నట్లుగానే ఉంది అని అంటున్నారు. 151 మంది ఎమ్మెల్యేలతో అప్రతిహతంగా అధికారం చలాయించిన వైసీపీకి తాజా ఎన్నికల ఫలితాలు బిగ్ షాక్ ని ఇచ్చాయి. ఏకంగా 11 సీట్లకు ఆ పార్టీ పడిపోయింది. వైసీపీకి మంచి క్యాడర్ ఉంది. కానీ దానిని పార్టీ అధినాయకత్వం నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటోంది అని అంటున్నారు. ఓటు బ్యాంక్ కూడా ఒక్కసారిగా 50 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది.
ఏపీలో రాజకీయ శూన్యత లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుని వస్తున్నారు. ఆయన 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దాంతో ఏపీలో ఆల్టర్నేటివ్ గా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీ క్యాడర్ లో విశ్వాసం పెంచుతూ వారిని దారికి తెచ్చుకోవాలంటే మాత్రం కచ్చితంగా ఇంతకు వేయింతలు కష్టపడాల్సి ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు క్యాడర్ ని మళ్లీ మొదటి నుంచి బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఒకవేళ క్యాడర్ సహకరించకపోతే తెలంగాణాలో బీఆర్ఎస్ అయినా ఏపీలో వైసీపీ అయినా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాయన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారంలో ఉన్నపుడు క్యాడర్ కనబడదు, అదే విపక్షంలోకి వచ్చాక క్యాడర్ కావాలి. కానీ క్యాడర్ వారి మాట విని ఎంతకాలం కష్టపడతారు, తమకూ మేలు జరగాలని కోరుకుంటారు.
వైసీపీలో కానీ బీఆర్ఎస్ లో కానీ క్యాడర్ అయితే విసిగి ఉన్నారని అంటున్నారు. బీజేపీ చాలా మటుకు బీఆర్ఎస్ ఓట్లను పార్లమెంట్ ఎన్నికల్లో లాగేసింది. ఏపీలో చూస్తే ప్రస్తుతానికి ఏ ఎన్నికలూ లేవు. కానీ మరో రెండేళ్లలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల నాటికి కనుక వైసీపీ బలంగా పుంజుకోకపోతే మాత్రం క్యాడర్ తో పాటు లీడర్లు కూడా వేరే వైపు వెళ్తారు అని అంటున్నారు. ఇప్పుడు అధినేతలకు పరీక్షా సమయం. అటు కేసీఆర్ ఇటు జగన్ తమదైన పాత విధానాలకు స్వస్తి పలికి పూర్తి మార్పుతో కొత్తగా క్యాడర్ విశ్వాసం చూరగొనాలి. మరి అది జరుగుతుందా అంటే వేచి చూడాల్సిందే.