చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ?

మొత్తంగా వైసీపీ వర్గాలు టెన్షన్ కు తెర దించుతూ తాజాగా పోలీసులు తీసుకున్న నిర్ణయం బిగ్ రిలీఫ్ గా మారింది.

Update: 2024-07-28 05:45 GMT

శనివారం రాత్రి బెంగళూరు ఎయిర్ పోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఉదంతం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరికాసేపట్లో దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అర్థరాత్రి దాటిన తర్వాత తిరుపతికి తీసుకు వచ్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అంచనాలకు భిన్నంగా సాగాయి. మొత్తంగా వైసీపీ వర్గాలు టెన్షన్ కు తెర దించుతూ తాజాగా పోలీసులు తీసుకున్న నిర్ణయం బిగ్ రిలీఫ్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ అనంతరం.. ఓట్ల లెక్కింపునకు కాస్త ముందుగా ఎస్వీయూ వర్సిటీ లో అప్పటి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరగటం తెలిసిందే. ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూంను పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై దాడి జరగటం.. దీనిపైఈసీ సైతం సీరియస్ కావటం.. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. ఏపీలో తీవ్ర సంచలనంగా మారిన ఈ దాడి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రధానంగా ఉండటం తెలిసిందే.

ఓట్ల లెక్కింపులో పులివర్తి నాని విజయం సాధించటం.. ఆ తర్వాత నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కనిపించకుండా పోవటం జరిగింది. అతగాడి గురించి పోలీసులు ఆరా తీస్తున్న ఫలితం లేని పరిస్థితి. ఇలాంటి వేళ.. దుబాయ్ కు పారిపోతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు హుటాహుటిన బెంగళూరు ఎయిర్ పోర్టుకు శనివారం రాత్రి వెళ్లారు. అక్కడ దుబాయ్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి నాయకత్వంలో వెళ్లిన పోలీసుల టీం మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతికి తీసుకొచ్చారు. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున తిరుపతిలోని ఎస్వీయూ పోలీసు స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత పులిపర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇప్పటివరకు 34 మంది అరెస్టు అయ్యారు.

దాడి కేసులో అదుపులో ఉన్న మోహిత్ రెడ్డిని కాసేపు విచారించారు పోలీసులు. ఇదిలా ఉండగా.. ఎస్వీయూ పీఎస్ వద్ద చెవిరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా.. మోహిత్ రెడ్డిని కాసేపు విచారించిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు షరతులు విధించారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన మోహిత్ రెడ్డి తనపై అక్రమంగా కేసులు పెట్టారని.. దీనిపై కోర్టులో పోరాటం చేస్తామని చెప్పారు. అంచనాలకు భిన్నంగా మోహిత్ రెడ్డిని రిమాండ్ కు పంపకుండా నోటీసులు ఇచ్చి వదిలేయటంతో వైసీపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.

Tags:    

Similar News