పిన్నెల్లి బ్రదర్ ఎక్కడ? 60 రోజులుగా గాయబ్

ఏపీ ప్రజలకు పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి హవా తెలుసు కానీ.. ఆయన వెనక ఉండి చక్రం తిప్పే ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి చేసే పనులపై పెద్దగా అవగాహన ఉండదని చెబుతున్నారు.

Update: 2024-07-22 04:35 GMT

చేతిలో అధికారం ఉన్నా లేకున్నా కొందరు మాత్రం తమ హవాను నడిపిస్తూ ఉంటారు. ఆ కోవలోకే వస్తారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి. మాచర్ల అల్లర్ల కేసులో ఆయన నిందితుడు.అయినా.. ఆయన జాడను ట్రేస్ చేయటం పోలీసులకు ఇప్పటికి సాధ్యం కాలేదు. సర్లే.. ఒక్క కేసు ఉన్న పెద్ద మనిషిని ఎంతని వెతుకుతామని భావించి డిస్కౌంట్ ఇద్దామనుకున్నా.. ఆయనపై చాలానే కేసులు పెండింగ్ లో ఉన్నాయి మరి.

సీఐపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా.. పోలింగ్ రోజు అల్లర్లకు సూత్రధారిగా.. మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్న పలు హింసాత్మక ఘటనలకు సంబంధం ఉన్న ఆయనపై కంప్లైంట్లు.. కేసులు నమోదు అయినప్పటికీ అదుపులోకి తీసుకోవటంలో మాత్రం అంతులేని జాప్యం నెలకొంది. ఏపీ ప్రజలకు పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి హవా తెలుసు కానీ.. ఆయన వెనక ఉండి చక్రం తిప్పే ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి చేసే పనులపై పెద్దగా అవగాహన ఉండదని చెబుతున్నారు.

మాచర్ల నియోజకవర్గంలో ఆయన చేసిన హింసాత్మక చర్యలు చెప్పుకుంటూ పోతే చాట భారతంలా ఉంటుందని చెబుతారు. పోలింగ్ వేల మాచర్ల పీడబ్ల్యూ డీ కాలనీ పోలింగ్ కేంద్రంలో బీభత్సానికి పాల్పడిన ఆయన.. కారుతో ఢీ కొట్టి పది మందిని గాయపర్చిన వైనాన్ని మర్చిపోలేం. తెలుగుదేశం పార్టీ నేత కేశవరెడ్డి ఇంటిపై దాడి చేశారు. కారును సైతం ధ్వంసం చేశారు.

వెల్దుర్తి మండలంలోని కుండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ మాణిక్యరావుపై పిన్నెల్లి సోదరులు ఇద్దరూ దాడికి పాల్పడటంతో పిన్నెల్లి సోదరులు ఇద్దరిపై అప్పట్లో కేసు నమోదైంది. పోలింగ్ మరుసటి రోజున కారంపూడి షీఐపైనే దాడి చేయటం సంచలనంగా మారింది. ఈ కేసులో వెంకట్రామిరెడ్డిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఇలా 370 కేసులు రెండు ఆయనపై ఉన్నా.. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఆయన జాడను పోలీసులు పసిగట్టలేని దుస్థితి. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కనిపించకుండా పోయి రెండు నెలలు కావొస్తున్నా.. ఇప్పటివరకు దొరక్కపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News