కామారెడ్డి-గజ్వేల్.. బిగ్ ఫైట్ ఎక్కడ?
కానీ, ఈ ఎన్నికల సందర్భంగా వీటి పేరు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశం కావడం ఖాయం.
తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు పెద్ద నాయకులు రెండు నియోజకవర్గాల్లో హోరాహోరీగా తలపడనున్నారు. పంతం పట్టిన నాయకులు.. ప్రతిష్ఠాత్మక పోరుకు సిద్ధమయ్యారు. ఇదంతా చూస్తుంటే వచ్చే 20 రోజులు ఎన్నికల సమరం హోరెత్తడం ఖాయం అనిపిస్తోంది. విచిత్రం ఏమంటూ ఆ మూడు నియోజకవర్గాలు మూడు వేర్వేరు జిల్లాల్లో ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే మూడు భిన్న ప్రాంతాల్లోనూ ఉన్నాయి. కానీ, ఈ ఎన్నికల సందర్భంగా వీటి పేరు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశం కావడం ఖాయం.
ఈ కొసన గజ్వేల్.. ఆ చివరన హుజూరాబాద్
తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం సిద్దిపేట. 1985 నుంచి 2004 వరకు 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే దూరంగా ఉన్న కేసీఆర్ 2014కు వచ్చేసరికి గజ్వేల్ ను తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. అక్కడినుంచి తొలుత సాధారణ మెజారిటీతో గెలిచినా, 2018కి వచ్చేసరికి ఆధిక్యాన్ని అమాంతం పెంచుకున్నారు. మరోసారి మూడోసారి కూడా ఇక్కడినుంచే పోటీకి సిద్ధం అవుతారు అని భావిస్తుండగా, అనూహ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రం కామారెడ్డిని కూడా ఎంచుకున్నారు. దీనికి నిర్దిష్ట కారణం ఏమీ చెప్పలేకున్నా.. ఏదో వ్యూహం ఉండే ఉంటుందని భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి వెన్నంటి ఉన్న ఈటల రాజేందర్ 2021లో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక.. ఇద్దరి మధ్య దూరం చాలా పెరిగింది. హుజూరాబాద్ లో ఈటల గెలుపును ఆపేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నూ గెలుపు కోసం ముప్పు తిప్పలు పెట్టే ఉద్దేశంలో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల ప్రకటించారు. ఇదే పెద్ద సంచలనం అనుకుంటే మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
ఆ దిక్కున కొడంగల్.. ఈ దిక్కున కామారెడ్డి
సీఎం కేసీఆర్ ఏ ముహూర్తాన కామారెడ్డి నుంచి పోటీ చేయాలనుకున్నారో..? ఆ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓవైపు గజ్వేల్ లో కేసీఆర్ మీద ఈటల పోటీకి సిద్ధమని ప్రకటించగా.. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో కేసీఆర్ ను ఢీకొడతానని స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే, జాతీయ పార్టీలు ఈ మేరకు రెండు సీట్లలో పోటీకి వీరిని అంగీకరిస్తాయో లేదోనని అనుమానం ఉండగా, దానిని పటాపంచలు చేస్తూ టికెట్లు దక్కాయి. కాగా ,రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అనే సంగతి తెలిసిందే. ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉంటుందీ నియోజకవర్గం. దక్షిణ తెలంగాణ పరిధిలోకి వస్తుంది. ఇక కామారెడ్డి పూర్తిగా ఉత్తర తెలంగాణ నేపథ్యం. ఒకవిధంగా చెప్పాలంటే కొడంగల్ ఈ చివరన ఉంటే కామారెడ్డి ఆ చివరన ఉంటుంది.
బిగ్ ఫైట్ ఎక్కడ?
గజ్వేల్, కామారెడ్డిలో ఇంతకూ బిగ్ ఫైట్ ఎక్కడ అంటే? కచ్చితంగా ఇక్కడే అని చెప్పలేని పరిస్థితి. కానీ, ఒక మార్కు కామారెడ్డి వైపే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కామారెడ్డికి ఇటు కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి ఇద్దరూ కొత్తనే. గజ్వేల్ లో అలా కాదు.. కేసీఆర్ ఇప్పటికే అక్కడినుంచి రెండుసార్లు గెలిచారు. అంటే ఇప్పటికే అక్కడి పోలింగ్ బూత్ ల నుంచి సామాన్య కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల వరకు అందరితోనూ నేరుగా పరిచయాలు ఉన్నట్లే. కానీ, కామారెడ్డిలో అలా కాదు కదా? ఇక్కడ ఇద్దరూ తొలిసారే పోటీ చేస్తున్నారు. ఇక సామాజికంగా చూసుకుంటే కామారెడ్డిలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువని చెబుతున్నారు. గజ్వేల్ లో ముదిరాజ్ లు పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొంటున్నారు. మరి.. ఈటలను బయటకు పంపినందుకు ఆగ్రహంగా ఉన్న ముదిరాజ్ లను, ఈసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న రెడ్లను ఎదుర్కొంటూ కేసీఆర్ గెలుస్తారా? లేక, ఆయనతో ఢీ అంటూ బరిలో దిగిన రేవంత్, ఈటల విజయం సాధిస్తారా? అనేది చూడాలి.