వీళ్లకు టిక్కెట్లు ఉన్నట్టా... లేనట్టా... సీన్ తేడా కొడితే అంతే...!
కొందరు బయటకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. మరికొందరు వచ్చే శారు కూడా.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ దూకుడుగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. దీంతో ఎన్నికలకు రెండు మూడు మా సాల ముందుగానే ఒక క్లారిటీ వచ్చేసింది. అసంతృప్తులు, సంతృప్తులు అందరూ కూడా.. సర్దుకున్నారు. కొందరు బయటకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. మరికొందరు వచ్చే శారు కూడా. దీంతో వైసీపీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టమైంది. ఇక, ఇప్పుడు అసలు సమస్య.. టీడీపీలోనే ఉంది. ఈ పార్టీ జనసేనతో చేతులు కలిపి మిత్రపక్షంగా ఎన్నికలకు వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ కూడా తమతో కలిసి వచ్చే అవకాశం ఉందని.. వచ్చేస్తే బాగుండునని కూడా టీడీపీ లెక్కలు వేస్తోంది. దీంతో అభ్యర్థుల జాబితాను ప్రకటించే విషయంలో తాత్సారం చేస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు, టీడీపీకి ఎన్ని, వస్తే.. చేతులు కలిస్తే.. బీజేపీకి ఎన్ని అనే విషయంలో ఇంకా చర్చ ల దశలోనే టీడీపీ ఉండిపోయింది. వాస్తవానికి సంక్రాంతికే జాబితాను విడుదల చేస్తామని.. గతంలో ప్రకటించిన పార్టీ ఇప్పటి వరకు ఈ విషయంపై మౌనంగానే ఉండిపోయింది.
ఈ నేపథ్యంలో పార్టీ జాబితా విషయంలో తాత్సారం జరుగుతూనే ఉంది. మరోవైపు.. టికెట్‌ను ఆశిస్తున్న బండారు సత్యానందరావు.. వంటి వారు నియోజకవర్గాల్లో జోరుగా కలియ దిరుగుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఆయన నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్తున్నారు. దీంతో వచ్చేఎన్నికల్లోఆయనకే టికెట్ ఇస్తారని, ఆయన అనుచరులు, ఆయన కూడా నిశ్చితాభిప్రాయం తో ఉన్నారు. అయితే.. ఈ నియోజకవర్గం ఇప్పుడు డోలాయమానంలో పడింది.
కొత్త పేట నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని జనసేన నుంచి డిమాండ్ వినిపిస్తోంది. తాము ఇక్కడ గెలిచి చూపిస్తామని అంటున్నారు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నుంచి కూడా.. జనసేన నాయకులు ఇటీవల మంగళగిరికి భారీ ర్యాలీ నిర్వహించి.. ఈ టికెట్‌ను తమకే ఇవ్వాలని.. పవన్‌కు విన్నవించారు. దీంతో నిన్న మొన్నటి వరకు యాక్టివ్‌గా పనిచేసిన సెంట్రల్ జనసేన నాయకులు స్తబ్దుగా మారారు. అంటే.. వీరి ఆశలు ఒకరకంగా ఉంటే.. టికెట్‌లు తేల్చకుండా.. టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది దీంతో చివరి నిమిషంలో తేడా వస్తే.. పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న.