అదానీపై నేరారోపణ... వైట్ హౌస్ ఇంట్రస్టింగ్ రియాక్షన్!

అదానీ గ్రూపుపై ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లతో నేరుగా మాట్లాడాల్సి ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ స్పందించారు.

Update: 2024-11-22 03:54 GMT

భారతీయ బిలియనీర్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీపై న్యూయార్క్ లో తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మిలియన్ డాలర్ల లంచం, మోసం వ్యవహారంలో అతని పాత్రపై అభియోగాలు మోపబడ్డాయి. ఇప్పుడు ఈ విషయం రెండు దేశాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో వైట్ హౌస్ స్పందించింది.

అవును... గౌతం అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతోపాటు మరో ఏడుగురుపై యూఎస్ లో అభియోగాలు మోపబడ్డ సంగతి తెలిసిందే. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చేందుకు అంగీకరించారని యూఎస్ లాయర్లు తెలిపారు.

అయితే ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా అదానీ గ్రూపు స్పందించి ఖండించింది. అయితే... దీనిపై భారత ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకూ స్పందించలేదు. ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి రాబోయే స్పందనపై తీవ్ర ఆసక్తి నెలకొందని అంటున్నారు. ఈ సమయంలో వైట్ హౌస్ ఆసక్తికరంగా స్పందించింది.

ఇందులో భాగంగా... ఈ ఆరోపణల గురించి సహజంగానే తమకు తెలుసని.. అదానీ గ్రూపుపై ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లతో నేరుగా మాట్లాడాల్సి ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ స్పందించారు.

ఇదే సమయంలో.. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య సంబంధం బలమైన పునాదిపై నిర్మించబడిందని నొక్కి చెప్పిన కరీన్ జిన్ పియర్... గౌతం అదానీపై లంచం, మోసం అంటూ వచ్చిన ఆరోపణలపై కొనసాగుతున్న సంక్షోభాన్ని అమెరికా నావిగేట్ చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోపక్క... అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం తెరపైకి రావడంతో అదానీ గ్రూపు సంస్థల షేర్లు కుదేలయ్యాయి. ఫలితంగా.. 10 అదానీ గ్రూపు సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.2.19 లక్షల కోట్లు క్షీణించింది. 2023లో హిండెన్ బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో చవిచూసిన నష్టంతో పోలిస్తే.. ఇది రెట్టింపు నష్టం కావడం గమనార్హం.

Tags:    

Similar News