నగరిలో ఇంటిపోరు... రోజాకు సహకరించేదెవరు?

అయితే... ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరిలో పరిస్థితి ఏమీ మారలేదని.. రోజాకు ఇంటిపోరు అలానే ఉందని అంటున్నారు.

Update: 2024-04-04 04:47 GMT

వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా మరోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి నగరి టిక్కెట్ రోజాకు దక్కడం లేదని, నియోజకవర్గంలో అంతర్గత పోరు పెరిగిందని కథనాలొచ్చిన వేళ జగన్ ఎంటరై వాతావరణాన్ని కూల్ చేసినట్లు చెబుతుంటారు. అయితే... ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరిలో పరిస్థితి ఏమీ మారలేదని.. రోజాకు ఇంటిపోరు అలానే ఉందని అంటున్నారు.

అవును... నగరిలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రోజా కలలు కంటున్నారని చెబుతున నేపథ్యంలో... స్థానికంగా సరికొత్త సమస్యలు ఆమెను చుట్టుముడుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా రోజాకు సహకరించేది లేదని ఆ నియోజకవరగంలోని సొంతపార్టీ నేతలే ఎర్ర జెండా ఎగరేస్తున్నారని, ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ కు కూడా తేల్చి చెప్పారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా నియోజకవర్గంలోని నగరి, పుత్తురు, వడమాలపేట, నిండ్రా, విజయాపురం మండలాలు ఉండగా.. ఈ ఐదు మండలాలోని వైసీపీ నాయకులతో రోజా కు వ్యవహారం చెడిందని అంటున్నారు. రెండో సారి గెలిచి, మంత్రి అయిన అనంతరం ఆమె వ్యవహార శైలిలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం అనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో... కలుపుకుపోయే విషయంలో రోజా వెనకబడిపోయారని.. తన వెంట ఎవరు వచ్చినా రాకపోయినా ఏమాత్రం పట్టించుకోను అన్నవిధంగా ఆమె వ్యవహార శైలి ఉంటుందని.. ఎవరు కలిసొచ్చినా రాకున్నా తన గెలుపు కన్ ఫాం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారని.. ఈ అతివిశ్వాసం ఆమెకు దెబ్బకొట్టొచ్చని అంటున్నారు.

మరోపక్క నగరి నియోజకవర్గంలోని తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాలలో రోజా భర్త సెల్వమణి.. వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నా.. అనుకున్నంత స్పందన రావడం లేదనే మాటలూ వినిపిస్తున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రోజా కాస్త సందిగ్ధంలో పడ్డారని.. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఆమెలో ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు!

ఈ నేపథ్యంలో... రోజా కాస్త తగ్గారని.. కలుపుకు పోవాలనే కృతనిశ్చయానికి వచ్చారని.. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న వైసీపీ స్థానిక రెబల్ నాయకులతో రాజీ ప్రయత్నాలు ప్రారభించారని అంటున్నారు. అయితే... ఈ విషయంలో అసంతృప్తులు, ఆగ్రహంతో ఉన్న నేతలు రోజా మాటలను పరిగణలోకి తీసుకోవడం లేదనే చర్చా తెరపైకి వచ్చింది.

దీంతో.. స్థానిక నేతలను కలుపుకు పోయే విషయంలో రోజా ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.. ఏమి చేస్తే స్థానిక నాయకులు రోజాను నమ్మి, ఆమె గెలుపుకు సహకరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఈ విషయంలో రోజాను ఒంటరిగా వదిలేస్తారా.. లేక, అధిష్టాణం పెద్దలు కల్పించుకుని కాస్త బుజ్జగింపులు చేసి సర్దుబాటు చేస్తారా అనేది వేచి చూడాలి!!

Tags:    

Similar News