మోడీ సీటు ఖాళీ చేస్తే కూర్చునేది ఆయనేనా...!?

మోడీ పక్కనే వినిపించే పేరు కేంద్ర హొం మంత్రి అమిత్ షా. ఇక కేంద్ర మంత్రి వర్గంలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా నితిన్ గడ్కరీ పేరు కూడా చెప్పుకుంటారు.

Update: 2024-02-10 17:30 GMT

కేంద్రంలో బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవరు ప్రధాని అన్న డౌట్లు అసలు అక్కరలేదు. ఎందుకంటే కచ్చితంగా ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీయే అని అందరికీ తెలుసు. మోడీ ఇమేజ్ తోనే బీజేపీ మళ్లీ గెలవబోతోంది అని కూడా సర్వేలు చెబుతున్నాయి. అయితే మోడీ తరువాత ప్రధాని పదవికి బీజేపీ ఆశావహులు ఎవరు అన్నది కూడా ఒక ఆసక్తికరమైన విషయం. మోడీ ప్రధాని కుర్చీని కనుక వదిలిపెడితే ఆ సీటులోకి రావాలని బీజేపీలో కీలక నేతలే ప్రయత్నం చేస్తున్నారు.

మోడీ పక్కనే వినిపించే పేరు కేంద్ర హొం మంత్రి అమిత్ షా. ఇక కేంద్ర మంత్రి వర్గంలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా నితిన్ గడ్కరీ పేరు కూడా చెప్పుకుంటారు. అలాగే యూపీ సీఎం యోగీ ఆదిత్యానాధ్ పేరు కూడా చెబుతారు. మరి మోడీ పాపులారిటీ గురించి అనేక సర్వేలు వెలువడ్డాయి. ఎవరిని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారు అని ఇండియా సీ ఓటర్ సర్వే చేస్తే అందులో మోడీయే అగ్ర భాగాన నిలిచారు.

ఇక బీజేపీలో చూస్తే మోడీ తరువాత ప్లేస్ అమిత్ షాదే అంటున్నారు. ఆయన తరువాత బీజేపీలో ప్రధానమంత్రి అవదగ్గ వ్యక్తి ఎవరు అంటే అమిత్ షాకు 29 శాతం ఓట్లు లభించాయని ఇండియా సీ ఓటర్ సర్వే వెల్లడించింది.

ఆ తరువాత వరసలో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాధ్ ఉన్నారు. ఆయనకు 25 శాతం మంది మోడీ వారసుడిగా ఓటేశారు. ఆయన మోడీ గద్దె దిగితే ప్రధాని కావలసిన వారు అని పేర్కొన్నారు. ఇక నితిన్ గడ్కరీకి 16 శాతం మంది ఓటేశారు. ఆయన మంచి నాయకుడని పరిపాలనా దక్షుడని ఈ ఓటింగ్ లో చెప్పుకొచ్చారు.

అంటే నరేంద్ర మోడీ వారసుడిగా మొదటి పేరు అమిత్ షా దే అని మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సర్వే తెలియచేసింది అన్న మాట. మోడీ షాలుగా ఇప్పటి బీజేపీ మారిపోయింది. దాంతో మోడీ తరువాత ఎవరూ అంటే అమిత్ షా పేరునే చెబుతారు. అదే మూడ్ ఆఫ్ ది నేషన్ లో వెల్లడి అయింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే బీజేపీలో చాణక్య పాత్రను అమిత్ షా పోషిస్తున్నారు. ఆయన బీజేపీ పార్టీ మొత్తం వ్యవహారాలను చక్కబెడుతున్నారు. మోడీ తరువాత కేంద్రంలో ప్రధాని కావాలని అమిత్ షాకు ఉందని కూడా అంటారు.

బీజేపీలో డెబ్బై అయిదేళ్ళు నిండిన వారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఒక నిబంధనను కూడా మోడీ షాలు గతంలో అమలు చేశారు. అలా చూస్తే కనుక 2024 సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 75 ఏళ్ళు నిండుతాయి. అంటే 2024 మేలో మోడీ ప్రధాని పదవి చేపట్టినా ఆయన ఏణ్ణర్ధం వ్యవధిలో ఆ పదవి నుంచి దిగిపోతారు అని అంటున్నారు. అంటే నిజంగా 75 ఏళ్లకే రాజకీయాల నుంచి తప్పుకోవాలి అన్న నిబంధనను పక్కాగా అమలు చేస్తేనే.

అపుడు మోడీ వారసుడిగా అమిత్ షా వస్తారు అని అంటున్నారు. ఈ సర్వేను చూసినా అదే కనిపిస్తోంది. మరి మోడీ అయిదేళ్ల పాటు ప్రధానిగా ఉంటూ 2029 లో అమిత్ షా రంగ ప్రవేశం చేస్తారా లేక మధ్యలోనే ఆయన వస్తారా అన్నది చూడాలి. కానీ ఈ సర్వే ప్రకారం చూస్తే మాత్రం మోడీ వారసుడు అమిత్ షా అనే జనాలు నమ్ముతున్నట్లుగా ఉంది మరి.


Tags:    

Similar News