రాంగ్....బూమరాంగ్...ఇంతేనా జగన్ ?

అసెంబ్లీలో మెంబర్ గా ఉంటారని జనాలు గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకపోవడం అన్నది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదనే అంటున్నారు.

Update: 2024-11-11 19:30 GMT

ఏపీ అసెంబ్లీకి వెళ్ళకూడదని వైసీపీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అనే అంతా అంటున్నారు. మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని ఎమ్మెల్యే ఫుల్ ఫార్మ్ లో చెప్పే మాట. అసెంబ్లీలో మెంబర్ గా ఉంటారని జనాలు గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకపోవడం అన్నది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదనే అంటున్నారు.

శాసన సభ ఎవరిది అంటే అది ప్రజలకు సంబంధించినది. ప్రజలు ఎవరిని అక్కడ మెంబర్లుగా నెగ్గించి పంపిస్తే వారే అక్కడ అడుగు పెట్టగలుగుతారు. అది ఒక పవిత్ర దేవాలయం అని కూడా చెప్పాలి. అన్ని పార్టీల వారూ అక్కడికి ప్రజల మన్ననలు పొంది వస్తారు ప్రజలకు సంబంధించిన వివిధ అంశాల మీద చర్చిస్తారు.

మేలైన వాటినే చట్టాలుగా చేస్తారు. ఇది కదా అసెంబ్లీలో జరిగేది. వైసీపీకి 151 సీట్లు 2019లో ఇచ్చారు. అంతకు ముందు 67 సీట్లు ఇచ్చారు. ఆ రెండు సందర్భాలలో సభకు వెళ్ళిన వైసీపీ 11 మంది సభ్యులతో వెళ్లమని చెబుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రతిపక్ష హోదా అన్నది ఇవ్వాలని అంటున్నారు.

ఆ హోదా కోసం వైసీపీ ఎటూ న్యాయ పోరాటం చేస్తోంది. ఆ విషయం తేలే వరకూ అయినా వైసీపీ ఒక రాజకీయ పక్షంగా సభకు వెళ్లవచ్చు కదా అని అంటున్నారు. అసెంబ్లీలో చూస్తే నాలుగే పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందులో టీడీపీ జనసేన బీజేపీ మూడూ అధికారం పంచుకుంటూ కూటమిలో ఉన్నాయి. ఇక మిగిలింది వైసీపీ. ప్రజలు అధికార పక్షం చెప్పేది వింటూనే తమ సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిపక్షం వాటిని అడగాలని కోరుకుంటారు. ఆ విధంగా చూస్తే అసెంబ్లీలో విపక్ష పాత్ర చాలా కీలకమైనదిగా చూడాల్సి ఉంది.

మరో వైపు చూస్తే గత అయిదు నెలల టీడీపీ కూటమి పాలనలో మంచి జరిగింది. అలాగే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మంచి ఏమి చేశామో ప్రభుత్వం ఎటూ చెప్పుకుంటుంది.నాణేనికి రెండవ వైపు చెప్పాల్సిన బాధ్యత విపక్షానిదే కదా. అలా వైసీపీ తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి కదా అని అంటున్నారు.

సూపర్ సిక్స్ హామీల విషయమే తీసుకుంటే బడ్జెట్ లో కొన్నింటి ఊసే లేదు, మరి అలాంటపుడు ప్రశ్నించాల్సింది ఎవరు, వైసీపీయే కదా. అలాగే ఏపీలో ఉన్న సమస్యలు కానీ పోర్టులను ప్రైవేట్ పరం చేస్తున్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేస్తున్నారని వైసీపీ చెబుతోంది. దానినే అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం ఏమిటి అన్నది తెలుస్తుంది కదా అని అంటున్నారు.

ఒక విధంగా ఏకైక ప్రతిపక్షంగా ఉండడం వైసీపీకి కలసి వచ్చిన అదృష్టం. ఇక మాట్లాడేందుకు మైక్ ఇవ్వరు అన్నది ఒక అనుమానమే అని అంటున్నారు. నిజంగా అలాగే చేస్తే కచ్చితంగా వాకౌట్ చేసి సభ నుంచి బయటకు రావచ్చు కదా. ప్రతీ సభ్యునికీ సభలో మాట్లాడే హక్కు ఉంది. అలాగే వైసీపీకి విపక్షంగా 11 మంది సభ్యులతో కూడిన ఒక శాసనసభా పక్షంగా కచ్చితంగా ఎక్కువ సమయమే ఇస్తారని అంటున్నారు.

అసెంబ్లీకి వెళ్లకపోవడానికి వైసీపీ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు అని అంటున్నారు. ప్రతిపక్ష హోదా అన్నది ఒక టెక్నికల్ ఇష్యూ. ప్రజలకు వాటితో సంబంధం లేదు. సభలో తాము గెలిపించిన వారు తమ సమస్యలను లేవనెత్తుతున్నారా లేదా అన్నదే వారు చూస్తారు

విపక్షంలో మంచి పెర్ఫాఫ్మెన్స్ ఇచ్చి ప్రజల మన్ననలు చూరగొంటే తిరిగి అధికారమూఅ అందుకోవచ్చు. నిజంగా గోల్డెన్ ఆపర్చ్యునిటీ వైసీపీ మిస్ చేసుకుంటోంది అని అంటున్నారు. చట్ట సభలలో ప్రజా సమస్యల మీద పోరాడితేనే వైసీపీకి పొలిటికల్ మైలేజ్ వస్తుంది అని అంటున్నారు. అలా కాకుండా సభను మొత్తం కూటమికే వదిలిపెట్టేస్తే అది రాంగ్ అవుతుంది. చివరికి బూమరాంగ్ అవుతుంది అని కూడా అంటున్నారు. మరి అసెంబ్లీకి వెళ్ళే విషయంలో వైసీపీ పునరాలోచన చేయాలనే అంతా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News