బాబూ...బీజేపీకి ఓటేయొద్దు !

అంతే కాదు కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు కూడా ఉన్నారు.

Update: 2024-10-23 23:30 GMT

ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో అతి ముఖ్య భాగస్వామిగా ఉన్నారు అన్నది తెలిసిందే. అంతే కాదు కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు కూడా ఉన్నారు. అలాగే చంద్రబాబు మంత్రివర్గంలో బీజేపీ మంత్రి ఉన్నారు.

ఈ విధంగా చూస్తే పచ్చగా బీజేపీతో టీడీపీ చెలిమి సాగుతోంది. అయితే ఈ చెలిమికి అగ్ని పరీక్ష లాంటిది వక్ఫ్ చట్టం సవరణ ప్రతిపాదనలు. దానికి సంబంధించిన బిల్లు ఒకటి ఈ శీతాకాల సమావేశాలలో పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

దాంతో టీడీపీ ఓటు ఎటు వైపు అన్నది అపుడు తెలుస్తుంది. బీజేపీకి పార్లమెంట్ లో ఏ బిల్లు పాస్ కావాలన్న మిత్రుల మద్దతు తప్పనిసరి. ఆ విధంగా చూస్తే కనుక కీలకమైన వేళ టీడీపీ వైపే బీజేపీ చూస్తుంది. కేంద్రంలో టీడీపీకి విలువ గౌరవం ఇస్తున్న బీజేపీ అధినాయకత్వం దానికి తగిన ప్రతిఫలం కూడా కోరుకుంటుంది అన్నది కూడా తెలిసిందే.

అయితే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ప్రతిపాదనలను ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీని మీద జాతీయ స్థాయిలో ఆందోళన సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీకి ఈ విషయంలో మద్దతు ఇవ్వవద్దని వక్ఫ్ బోర్డ్ చట్టం సవరణ బిల్ల్కు ఓటు వేయవద్దు అని ముస్లిం సంఘాల నేతలు టీడీపీని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తాజాగా అమరావతిలోని సచివాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా వారు వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన వల్ల వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

దీని వల్ల ఏకంగా ముస్లిం వర్గం హక్కులు, వారి ప్రయోజనాలే కాకుండా మనోభావాలు పూర్తిగా దెబ్బ తింటాయని అంటున్నారు. ఇవన్నీ తమ భావాలు అని చెబుతూ ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను ఆందోళనను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తిగా

వివరించారు. వక్ఫ్ చట్టంలో మార్పులను అంగీకరించవద్దని వారంతా స్పష్టం చేశారు. ఈ బిల్లు ఎపుడు వచ్చినా కూడా పార్లమెంట్ లో చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం ప్రతినిధులకు తెలిపారు.

అయితే ఇది చంద్రబాబుకు టీడీపీకి అంత ఈజీ టాస్క్ కాదని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ పట్టుదల ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాంటి బీజేపీ ఈ విషయంలో సీరియస్ గానే ఉంటుంది. మరో వైపు టీడీపీకి మైనారిటీల మద్దతు అవసరం వారి మనోభావాలు కూడా టీడీపీకి అవసరం. మరి ఈ సమస్య నుంచి బాబు ఎలా బయటపడతారు అన్నది చూడాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News