అర్జంటుగా చినబాబుని ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిందే !
ఏపీలో టీడీపీ కూటమి పాలన నాలుగు నెలలు పూర్తి చేసుకుని అయిదవ నెలలోకి అడుగుపెడుతోంది.
ఇది డిమాండా లేక విన్నపమా లేక అర్ధింపా లేక కోరికా అంటే అన్నీ కలసినవే అనుకుంటే పోలా. మరి ఎవరివి ఇవన్నీ అంటే చినబాబు అభిమానులు అనుచరులు తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి పాలన నాలుగు నెలలు పూర్తి చేసుకుని అయిదవ నెలలోకి అడుగుపెడుతోంది.
అయితే మొదటి రెండు మూడు నెలలలో గమ్ముని ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇపుడు జోరు పెంచేశారు. చంద్రబాబు యాధాలాపంగానో ఆరోపణగానో అన్న శ్రీవారి లడ్డూల కల్తీ వ్యవహారాన్ని పీక్స్ కి చేర్చిన ఘనత అచ్చంగా పవన్ బాబుదే. ఆయన ఏకంగా తమిళనాడు దాకా ఈ వ్యవహారాన్ని తీసుకుపోయారు.
అసలు శ్రీవారి లడ్డూలకూ సనాతన ధర్మానికి లింక్ పెట్టి ఆ మీదట సనాతన ధర్మ బోర్డుకు కూడా మ్యాటర్ తీసుకెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రాయశ్చిత్త దీక్షల సందర్భంగా చేసిన హాట్ కామెంట్స్ అలాగే వారాహి డిక్లరేషన్ పేరిట తిరుపతి సభలో చేసిన మరిన్ని కామెంట్స్ ఇవ్వన్నీ టీడీపీ కూటమిని కొంత ఇరకాటంలో పెట్టాయని అంటున్నారు.
మరో వైపు చూస్తే చంద్రబాబు తో సమానంగా ఇంకా చూస్తే మరీ ఎక్కువగా పవన్ బాబు హైలెట్ అవుతున్నారు. సాధారణంగా చూస్తే ముఖ్యమంత్రి తరువాత ప్లేస్ లో డిప్యూటీ సీఎం ఉంటారు. ఆయననే తరువాత అని అంతా అనుకుంటారు. టీడీపీ కూటమి ప్రభుత్వం పేరుతో అధికారంలో ఉన్నా నిజానికి నూటికి తొంబై శాతం పైగా అధికారాన్ని చలాయిస్తోంది టీడీపీ మాత్రమే.
అదే విధంగా చూస్తే టీడీపీ మాటే అన్ని విధాలుగా చెల్లుబాటు అవుతోంది. కానీ జనాలలో మాత్రం పవన్ హైలెట్ అవుతున్నారు అన్నది ఒక చర్చ అయితే ఉంది. అదే సమయంలో చంద్రబాబు నాలుగవ సారి సీఎం అయింది తన కోసం కంటే కూడా చినబాబుని భవిష్యత్తు సీఎం గా చేసేందుకు చూసేందుకు కూడా అన్నది కూడా ఉంది.
ఇక టీడీపీ కూటమి పాలన ఇలాగే సాగితే పవన్ మరింత కీలకంగా అవుతారు. జనంలో ఆల్టర్నేషన్ గా కూడా ఉంటారు. అదే విధంగా చంద్రబాబు తరువాత స్థానం ఆయనదే అన్న ముద్ర కూడా పడుతుంది. దాంతో టీడీపీ తమ్ముళ్ళ నుంచి వస్తున్న డిమాండ్ ఏంటి అంటే చినబాబును కూడా ఉప ముఖ్యమంత్రిని అర్జంటుగా చేసేయమని.
ఇక్కడ టీడీపీ కూటమిలో పవన్ కి పోటీగా అన్నది మాత్రమే కాదు తమిళనాడులో చూస్తే ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అయిపోయారు అని కూడా గుర్తు చేస్తున్నారు. ఆ విధంగా అటు బయట జనాలకూ పార్టీ జనాలకూ కూడా ఒక బలమైన సంకేతం పంపించినట్లు అవుతుందని కూడా అంటున్నారుట.
ఇప్పటికే చూస్తే చాలా విషయాలలో చినబాబు తన సలహా సూచనలు అందిస్తూ పోతున్నారు. దాంతో ఆయనకు మరింత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా జనంలో ఫోకస్ కావాలంటే ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సిందే అన్న చర్చ అయితే సాగుతోంది. నిజానికి కేవలం టీడీపీ ప్రభుత్వమే ఉండి ఉంటే ఈపాటికే ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండేవారు.
కానీ కూటమి ప్రభుత్వంగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ కూటమిలో ఒక్కటే డిప్యూటీ సీఎం పదవి ఉండాలని కండిషన్ పెట్టారని కూడా ప్రచారంలో ఉంది. దాంతో టీడీపీ కూటమిలో రెండవ ఉప ముఖ్యమంత్రి పదవి సాధ్యమా. అది జనసేనకు సమ్మతమా అన్నది కూడా చర్చకు వస్తోంది
అయితే చంద్రబాబు మీద ఈ విషయంలో అయితే ఒక రకమైన ఒత్తిడి ఉందని ప్రచారంగానూ పుకారుగానూ షికారు చేస్తోంది. ఇది ఎంతవరకూ నిజమో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా లోకేష్ బాబుని చంద్రబాబు తరువాత సీఎం గా చూపించాలన్నదే తమ్ముళ్ల ఆశ ఆరాటం కోరికట. మరి అది ఇప్పట్లో నెరవేరుతుందా. ఏమో. చూడాల్సిందే.