జగన్... అసెంబ్లీ పిలుస్తోంది !

ఇపుడు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిన నేపథ్యం ఉంది.

Update: 2024-10-30 23:30 GMT

మాజీ ముఖ్యమంత్రిగా అయిదేళ్ల పాటు అసెంబ్లీలో జగన్ తనదైన పాలన చేశారు. అంతకు ముందు 2014 నుంచి 2017 దాకా ఆయన మూడేళ్ళ పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. ఇపుడు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిన నేపథ్యం ఉంది.

దాంతో పాటు జగన్ తనకు విపక్ష హోదా కావాలని పట్టుబడుతున్నారు. నిజానికి ఏపీ అసెంబ్లీలో 11 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఆయనకు విపక్ష హోదాతో పాటు కేబినెట్ ర్యాంక్ దక్కుతుంది. అయితే ఇపుడు అది సాధ్యం కాదు అని అంటున్నారు.

హోదా ఇవ్వాలి అని అనుకున్నా అది స్పీకర్ చేతిలో ఉంది. ఆయన సభా నిబంధలను చూస్తున్నారు. ఆ విధంగా చూస్తే కనుక జగన్ కి విపక్ష హోదా రాదు. మరి జగన్ విపక్ష హోదా ఎందుకు కోరుకుంటున్నారు అంటే సభలో కావాల్సినంత సేపు మాట్లాడడానికి ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అని అంటున్నారు

అయితే ఆ విషయంలో స్పీకర్ హామీ ఇస్తున్నారు.జగన్ కి మైకు ఇస్తామని చెబుతున్నారు. దాంతో జగన్ స్పీకర్ ఇచ్చిన ఈ హామీని వాడుకోవాల్సి ఉంది. అందుకోసం అయినా అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంది. నిజానికి ఏపీలో 2024 ఎన్నికల తరువాత అసెంబ్లీ ఇప్పటికి రెండు సార్లు సమావేశం అయింది. జగన్ ఈ రెండు సార్లూ తొలి రోజు మాత్రమే సభకు హాజరై బయటకు వచ్చేశారు

కానీ ఈసారి బడ్జెట్ సెషన్ లో మాత్రం ఎక్కువ రోజులు సభ జరగనుంది. దాంతో పాటు ఎన్నో అంశాలు చర్చకు వస్తాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి అయిదు నెలలు అవుతోంది. దాంతో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజల తరఫున గొంతుకగా మారి వైసీపీ సభలో ఆ సమస్యలను ప్రస్తావించాల్సి ఉంది. ఎందుకంటే వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా సభలో ఉంది.

మొత్తం అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే మూడు పార్టీలు కూటమి కట్టి అధికారంలో ఉన్నాయి. దాంతో వైసీపీ విపక్షంలో ఉన్న ఒకే ఒక పార్టీ. మరి ప్రజలు వైసీపీ వైపు చూస్తారు.ఈ విషయాన్ని వైసీపీ అధినాయకత్వం అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.

ఇక ఇప్పటికే వైసీపీ అధినాయకుడు జగన్ జనంలోకి వెళ్తున్నారు. ఆయన అపుడపుడు పర్యటనలు జరుపుతూ జనం సమస్యలను ప్రస్తావిస్తున్నారు. వాటినే ఆయన సభలో ప్రస్తావిస్తే మరింత విలువ పెరుగుతుంది. పైగా సీఎం సహా మంత్రులు అంతా సభలో ఉంటారు. వారి ముందే సమస్యలను చెబితే న్యాయం జరుగుతుంది అని అంటున్నారు. ఒక వేళ ప్రభుత్వం ఆ దిశగా స్పందించకపోతే తప్పు ప్రభుత్వానిది అవుతుంది తప్ప వైసీపీకి పొలిటికల్ గా అది కలసి వస్తుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే జగన్ తనకు ప్రతిపక్ష హోదా కావాలని కోరుతూ కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ కోర్టుకు వెళ్లారు. కోర్టులో దాని మీద తీర్పు ఎపుడు వస్తుందో ఇంకా తెలియదు. మరి అంత వరకూ జగన్ సభకు వెళ్ళకూడదని భీష్మించుకుని కూర్చుంటే మాత్రం అది ఆయనకే కాదు వైసీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ని ఈసారి కచ్చితంగా అసెంబ్లీ పిలుస్తోంది. మరి జగన్ తీసుకోబోయే నిర్ణయం మీదనే వైసీపీ రాజకీయం ఏంటో తెలుస్తుంది.

Tags:    

Similar News