ఉద్ధానం ఏడుస్తోంది బాబూ !

ఎవరికీ చేయి చాచకుండా తమ కుటుంబం బతకాలని ఇక్కడ రైతులు కోరుకుంటారు.

Update: 2024-11-30 21:30 GMT

ఉద్ధానం ఈ పేరు ఎక్కువగా పరిచయమే. కొబ్బరి జీడి తోటలకు ప్రసిద్ధి ఈ ప్రాంతం. ఇక్కడ రైతులకు ఇదే ఫలసాయాన్ని అందిస్తోంది. వారికి ఇదే జీవనాధారం కూడా. ఉద్ధానంలో ఉన్న వారు అంతా భూమిని నమ్ముకుంటారు. దాంతో పాటు ఈ కొబ్బరి, జీడి తోటలనే తమ కొడుకులుగా భావిస్తారు.

ఎవరికీ చేయి చాచకుండా తమ కుటుంబం బతకాలని ఇక్కడ రైతులు కోరుకుంటారు. అందుకే వారికి ప్రభుత్వాలు ఏమి ఇస్తున్నాయి ఏ విధంగా తమను ఉద్ధరిస్తున్నాయన్నది పక్కన పెడితే తమ భూమే తమను కాపాడుతుందని విశ్వాసంతో ఉంటారు. అదే వారికి ధీమా.

ఇది ఈనాటి కధ కాదు తరతరాలుగా సాగుతున్నదే. ముత్తాత తాత తండ్రుల నుంచి వస్తున్నదే. అందరికీ నీడనిచ్చి నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళేలా చేసే ఉద్ధానం భూములకు ఇపుడు ఎసరొచ్చి పడిందని వందలాది మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భూములు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతే అది కొద్దికాలం బాధేనని కానీ ఇపుడు కళ్ళ ముందే అవి తమకు కాకుండా పోతున్నాయని రైతాంగం మొత్తం కన్నీటి పర్యంతం అవుతోంది.

తమకు భూములకు దూరం చేయవద్దు చంద్రబాబూ పవన్ కళ్యాణ్ అని వారు ఇపుడు చేతిలెత్తి దండం పెడుతున్నారు. ఇంతకీ ఎందుకు ఇలా వారు ప్రభుత్వ పెద్దలను ప్రాధేయ పడుతున్నారు, అసలు ఏమి జరుగుతోంది అన్నది చూస్తే కనుక నిజంగా ఉద్ధానం రైతులది కన్నీటి కధ అన్నది అర్ధం అవుతుంది.

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది ప్రతీ జిల్లాకూ ఎయిర్ పోర్టు అన్నది ఆ విధానం ఆ విధంగా చూస్తే శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ కార్గో ఎయిర్ పోర్టుని ఏర్పాటు చేయడానికి చూస్తోంది. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయం చెప్పారు.

శ్రీకాకుళం దశ తిరిగేలా ఎయిర్ పోర్టుని నిర్మిస్తామని ఆయన ప్రకటించి వెళ్లారు. అంతవరకూ బాగానే ఉన్నా ఎయిర్ పోర్టు కోసం పచ్చని పోలాలను భూ సేకరణ అంటూ తీసుకోవడం ఏంటని ఉద్ధానం రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏకంగా 1320 ఎకరాల భూమిని ఇక్కడ నుంచి సేకరించాలని చూస్తున్నారు.

ఇరవై గ్రామాలకు చెందిన వందలాది రైతుల భూములు ఎయిర్ పోర్టు కోసం ఇవ్వాల్సి వస్తోంది. దాంతో ఉద్ధానం రైతులు అన్నం నీళ్ళూ మానేసి రాత్రీ పగలూ ఏడుస్తూ గడుపుతున్నారు. ఈ భూమిలోనే తమ ప్రాణాలు ఇవ్వాలని ఈ మట్టిలోనే కలసిపోవాలని తాము అనుకున్నామని కానీ ప్రభుత్వం తమ భూమలను తీసుకోవడంతో తాము ఏమి చేయాలని వారు ఆవేదన చెందుతున్నారు

ఇక చూస్తే కనుక 2018లో తిత్లీ తుఫాను వచ్చి ఉద్ధానం మొత్తం వైభోగం ఊడ్చేసింది. అందమైన కొబ్బరి తోటలు పోయి శ్మశాన వాతావరణం కనిపించింది. దాంతో రైతులు నాడు ఎంతో కలత చెందారు. తమ భూములలో మళ్లీ కొబ్బరి తోటలు జీడి తోటలు చూస్తామా అని వారు వాపోయారు.

మొత్తానికి వారి కష్టం ఫలించి ఇన్నేళ్ళ తరువాత ఆ తోటలు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది తాము మంచి ఫలసాయం పొందుతామని రైతన్నలు ఎంతో సంతోషంలో ఉండగా పిడుగు లాంటి వార్త వారికి చేరింది. మీ భూములు ఎయిర్ పోర్టుకు ఇవ్వాలని వారిని అధికారులు కోరడంతో భూమి చీలినట్లుగా అయిందని అంటున్నారు.

తాము భూములు ఇవ్వలేమని వారు అంటున్నారు. తమ భూములు తీసుకోవడానికేనా చంద్రబాబు అధికారంలోకి వచ్చిందని కూడా నిష్టూర మాడుతున్నారు. పర్ర భూములు తీసుకుని ఎయిర్ పోర్టు కట్టవచ్చు కదా పచ్చని పొలాలలో చిచ్చు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చావనైనా చస్తాము కానీ భూములు మాత్రం ఇచ్చేది లేదని శపధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయినా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

ఇక వీరికి మద్దతుగా ప్రజా సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. ఎయిర్ పోర్టు కోసం రైతుల పొట్ట కొడతారా వారి ఉపాధికి గండి కొడతారా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మరో వైపు చూస్తే భోగాపురం ఎయిర్ పోర్టు దగ్గరలోనే ఉందని. అది ఏకంగా నాలుగు వేల ఎకరాలలో నిర్మిస్తున్నారని మళ్లీ పచ్చని పొలాలలో ఎయిర్ పోర్టు ఎందుకు అని వామ పక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అయితే నిర్ణయం తీసేసుకుంది. మరి ఉద్ధానం కొబ్బరి తోటలు నిలుస్తాయా రైతుల కన్నీరు ఆగుతుందా అన్నదే ఇపుడు అంతటా చర్చగా ఉంది.

Tags:    

Similar News