'పన్నుకు పన్నే' సమాధానం.. ట్రంప్ మాతో పెట్టుకోకు.. ట్రూడో
ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కెనడా ప్రధాని ట్రూడో మాటల కారణంగా.
'కంటికి కన్ను.. పంటికి పన్ను..' ఇదీ కొందరి వ్యవహార శైలి. అంటే అవతలి వాడు ఎలా వ్యవహరిస్తే వారికి దీటుగా సమాధానం చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కెనడా ప్రధాని ట్రూడో మాటల కారణంగా.
చిరకాల మిత్రదేశాల మధ్య..
అమెరికా-కెనడా చిరకాల మిత్రదేశాలు. అంతేకాదు.. ఈ రెండింటి మధ్య కెనడా శాశ్వత పౌరులకు వీసా కూడా అవసరం లేదు. కానీ, ఇప్పుడు కెనడా-అమెరికా ఉప్పు-నిప్పు మాదిరిగా మారాయి. కారణం.. కయ్యాలమారి జస్టిన్ ట్రూడో. ఆపై వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాల డొనాల్డ్ ట్రంప్. వాస్తవానికి అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తులు సహా అమెరికాకు 65 శాతం చమురు, చెప్పుకోదగ్గ స్థాయిలో విద్యుత్తు, మొత్తం సహజ వాయువును కెనడానే ఎగుమతి చేస్తోంది. అదనపు పన్నులు విధిస్తే వీటి ధరలు గణనీయంగా పెరుగుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు టారిఫ్ లు పెంచితే ఆహారం, దుస్తులు, ఆటోమొబైల్, ఆల్కహాల్, ఇతర వస్తువుల ధరలు నాటకీయంగా పెరుగుతాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం చేసే దేశాలు కూడా కూరగాయలు, పండ్లపై సుంకాలు పెంచితే అమెరికాలో రైతులు తీవ్రంగా నష్టపోతారనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
కెనడా, చైనా, మెక్సికోలపై ట్రంప్ గురి..
ఇటీవలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, చైనా, కెనడాలపై ఫోకస్ పెట్టారు. ఈ దేశాల నుంచి వస్తున్న ఫెంటనిల్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. మెక్సికో, కెనడాపై అదనపు పన్నులు విధించి.. ద్రవ్యోల్బణం తగ్గిస్తామని ట్రంప్ బృందం అమెరికన్లకు వాగ్దానం చేసింది. దీంతోనే ట్రూడో స్పందించారు. తమ జోలికొస్తే.. అమెరికా ప్రజలు ఆ ఫలితాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు. తాము ట్రంప్ సుంకాలను తిప్పికొడతామని తేల్చిచెప్పారు.
మీరు ఎలా చేస్తే మే అలా..
తమ ప్రతి వస్తువుపై ట్రంప్ టారిఫ్ లు విధిస్తే.. వారికీ అలానే బదులిస్తామని ట్రూడో అంటున్నారు. వారు కొనే ప్రతి వస్తువు ధరను పెంచుతామని అమెరికన్లు అర్థం తెలుసుకుంటారని అన్నారు.
‘ప్రజల జీవితాలను సరళం చేస్తామని ట్రంప్ అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు వారికి నిజం తెలుస్తోందని పేర్కొన్నారు. కెనడా వస్తువులపై సుంకాలు విధిస్తే.. తమ జీవన వ్యయాలు మరింత పెరుగుతాయని అమెరికన్లు తెలుసుకుంటున్నారని అన్నారు.
వాణిజ్య భాగస్వాములపై విధించే సుంకాలతో ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరగవని హామీ ఇవ్వలేనని.. 25శాతం సుంకాలు కెనడా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని ట్రూడో ఇటీవల పేర్కొన్నారు.