ఆ సానుభూతి జగన్ కి మళ్లీ వర్కౌట్ అవుతుందా...!?

2011 మేలో జరిగిన ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేస్తే కడప పార్లమెంట్ నుంచి వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేశారు.

Update: 2024-01-24 17:42 GMT

జగన్ కాంగ్రెస్ ని వీడి వేరే పార్టీ పెట్టుకున్నారు. అప్పట్లో దేశమంతా కాంగ్రెస్ ఉంది. అన్నింటికీ మించి కేంద్రంలో అధికారం ఇంకా నాలుగేళ్ళు నిండుగా ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చి బలమైన నాయకురాలుగా ఉన్న సోనియా గాంధీని ఎదిరించారు. 2011 మేలో జరిగిన ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేస్తే కడప పార్లమెంట్ నుంచి వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేశారు.

అయితే పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ మీద వివేకానందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆయన అప్పటికి మంత్రి కూడా. అలా ఆయన పోటీ చేస్తే జనమంతా జగన్ వైపు నిలబడ్డారు, ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సాగింది. దాంతో వివేకా ఓటమి పాలు అయ్యారు. ఇక జగన్ ఎంపీ సీటులో పోటీ చేసి అయిదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది ఒక రికార్డు.

తిరిగి ఇన్నాళ్ళకు వైఎస్సార్ కుటుంబంలో మరో చీలిక వచ్చింది. ఆనాడు వైఎస్సార్ వివేకా కుటుంబాలలో చీలిక వస్తే జనాలు జగన్ వెంట ఉన్నారు. ఆ సానుభూతి కూడా తోడు అయింది. ఈసారి ఏకంగా వైఎస్సార్ కుటుంబంలో నిలువుగా చీలిక వచ్చింది. అన్నా చెల్లెలు ఇద్దరూ పోటా పోటీగా ముందుకు వచ్చారు. ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత అయితే మరొకరు కాంగ్రెస్ కి ఏపీ ప్రెసిడెంట్. అలా ఇద్దరూ 2024 ఎన్నికల్లో తలపడుతున్నారు.

దీని మీద తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన విద్యా సదస్సులో జగన్ ఏమన్నారు అంటే కాంగ్రెస్ కి చరిత్ర గుణపాఠాలు ఎన్ని చెప్పినా బుద్ధి రాలేదు అని. గతంలో నా సొంత చిన్నాన్నను మా పైన పోటీకి దించి పరాభవం పాలు అయ్యారు. ఇపుడు ఏకంగా నా సోదరిని నా మీద పోటీగా దించారు. అయినా అన్నీ దేవుడు చూసుకుంటారు. కాంగ్రెస్ కి మరోసారి పరాభవం జరగడం తధ్యమని చెప్పుకొచ్చారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ కాంగ్రెస్ కి విభజించి పాలించు అన్నది బాగా అలవాటు అన్నారు. ఉమ్మడి ఏపీని రెండుగా చీల్చింది ఇదే కాంగ్రెస్. ఇపుడు నా కుటుంబాన్ని రెండుగా చీల్చింది అని ఆయన చెప్పారు. అన్నీ ప్రజలు దేవుడూ గమనిస్తున్నారు అని ఆయన అనడం విశేషం.

అంటే ఆయన సోదరి షర్మిల విషయంలో పూర్తి తప్పు కాంగ్రెస్ దే అని అంటున్నారు. తన చెల్లెలును కాంగ్రెస్ తన మీదకు ఎగదోస్తోంది అన్నది జగన్ ఆరోపణ. ఈసారి కూడా కాంగ్రెస్ కుతంత్రాలు కుట్రలు సాగవని ఆయన నిబ్బరంగా ఉన్నారు. అంతే కాదు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ పట్ల జనంలో సానుభూతి ఈ విషయంలో ఉంటుందా ఉంటే అది ఎంతమేరకు అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇప్పటికి పదమూడేళ్ల క్రితం జగన్ అనే కొత్త నేతను, యువకుడిని జనాలు ఆదరించారు. ఆయనకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని జనాలు ఆయనకు మొత్తంగా అండగా నిలబడ్డారు.

ఇపుడు చూస్తే జగన్ అయిదేళ్ల పాటు విపక్ష నేతగా ఉన్నారు. అలాగే మరో అయిదేళ్ల పాటు సీఎం గానూ ఉన్నారు. జగన్ ఏమిటో జనాలు చూశారు. ఆయన పాలన కూడా చూశారు. ఇపుడు కాంగ్రెస్ కుట్రలు కుత్రంత్రాలు తన ప్రభుత్వం మీద ప్రయోగిస్తోందని, తన కుటుంబం మీద చేస్తోందని జగన్ అంటున్నారు.

అయితే ఈసారి జగన్ కి జనాల నుంచి అంతే స్థాయిలో సానుభూతి లభిస్తుందా అన్నది చర్చకు వస్తోంది. జగన్ నా కుటుంబాన్ని చీల్చారు అని కాంగ్రెస్ తో పాటు టీడీపీ తదితర విపక్షాలు అని జనంలోకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. దానికి ఆయన తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన విద్యా సదస్సులో ఒక బలమైన సంకేతం ఇచ్చేశారు. ఒక విధంగా చూస్తే ఇది సెంటిమెంట్ గా కూడా బలంగా పనిచేసే అవకాశం ఉంది. అందుకే జగన్ తన సోదరిని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు అని జనం లోకి రానున్నారు.

అయితే ఒక్క మాట ఇక్కడ చెప్పుకోవాలి. జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. జనాలు చూస్తున్నారు. కారణాలు ఏమైనా కూడా విపక్షాలు అన్నీ కత్తి కట్టాయి. సరే వాటి సంగతి అలా ఉంచితే సొంత చెల్లెలు అన్నకు ఈ క్లిష్ట సమయంలో ఎదురుగా నిలబడి విమర్శలు చేస్తే అది జనంలో వేరే అర్ధాలకు వెళ్తుంది అని అంటున్నారు. ఈ సమయంలో ఆమె ఉండాల్సింది అన్న వైపు కదా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి వైఎస్ షర్మిల గత ఎన్నికల్లో అన్న పక్కన నిలబడి విజయంలో భాగం అయ్యారు. ఇపుడు ఎదురు నిలిచి అన్నకు మళ్లీ విజయం దక్కేలా చేస్తారా అంటే వెయిట్ అండ్ సీ.


Tags:    

Similar News