ఏపీలో మాజీ సీఎంల పిల్లలు ఈసారి గెలుస్తారా?
ఈ సమయంలో ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్న మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంది. మరోపక్క ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి పీక్స్ కి చేరుకుంది! మరో ఐదారు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో... ఏపీలో అన్ని పార్టీలూ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ఈ సమయంలో ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్న మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో వారి గెలుపుపై చర్చ తెరపైకి వచ్చింది!
అవును... ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు చాలామంది పోటీ చేస్తున్నారు. సొంత బిడ్డలతో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా బరిలో నిలుస్తున్నారు. దీంతో వీరి గెలుపోటములపై ఆసక్తి నెలకొంది. వీరిలో ఎంతమంది గెలుస్తారు.. ఏ స్థాయి మెజారీటీతో గెలుస్తారు.. ఎంతమంది ఓటమి పాలవుతారు అనే చర్చ ఆసక్తిగా మారుతుంది. ఈ నేపథ్యంలో.. వారు ఎవరు.. ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు.. మొదలైన విషయాలను ఇప్పుడు చూద్దాం...!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి - జగన్:
ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి అనే సంగతి ఏపీలో తెలియనివారుండరన్నా అతిశయోక్తి కాదేమో! దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్ 2019 ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఆయన పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుండగా.. రాష్ట్రంలి మెజారిటీ స్థానాల్లో పార్టీ గెలుస్తుందని ధీమాగా ఉన్నారు!
నారా చంద్రబాబు నాయుడు - లోకేష్:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ లోనూ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమిపాలైన ఆయన.. ఈ ఎన్నికల్లో అదేస్థానం నుంచి గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు. 2014 - 19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లోకేష్ మంత్రిగా కూడా పనిచేశారు.
నాదెండ్ల భాస్కరరావు - మనోహర్:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1984లో ఆగస్తు 16 నుంచి సెప్టెంబర్ 16వరకూ నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి చిట్టచివరి స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ 2011 - 2014 మధ్యకాలంలో రాష్ట్ర విభజన వరకు ఆ పదవిలో ఉన్నారు.
ఎన్టీ రామారావు - బాలకృష్ణ:
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా 2014, 2019 ఎన్నికల్లో అదేస్థానం నుంచి గెలిచిన ఆయన.. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు! అంతకుముందు ఎన్టీఆర్ కూడా ఇదే అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
నేదురుమల్లి జనార్దన రెడ్డి - రాంకుమార్:
1990 - 1992 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి... తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 1989 ఎన్నికలలో వెంకటగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తరువాత జనార్దనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
కోట్ల విజయభాస్కర రెడ్డి - సూర్యప్రకాశ్:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు (1982 - 83 & 1992 - 94) ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర రెడ్డి కుమారుడు జయసూర్య ప్రకాశ్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుచున్నారు. ఈయన గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు!
ఎన్టీ రామారావు - దగ్గుబాటి పురందేశ్వరి:
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావూ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి 2024 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న ఆమె... గతంలో కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి - షర్మిల:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల.. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఆమె కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో తెలంగాణలో వైఎస్సార్టీపీ అనే పార్టీని స్థాపించిన ఆమె.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ నుంచి వైదొలిగి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు.
వీరితోపాటు మాజీ సీఎంల కుటుంబాలకు చెందిన మరికొందరు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్ సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. మరోపక్క అతని సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.