ఆ చానల్ లో డిబేట్ కు అయితే రానంటూ ట్రంప్ కొత్త మెలిక

బైడెన్ బరిలో ఉన్నప్పుడు ట్రంప్ ఏ రీతిలో అయితే దూకుడుగా వ్యవహరించారో.. ఇప్పుడు అలాంటి సీన్ కమలా నుంచి ట్రంప్ నకు ఎదురవుతోంది.

Update: 2024-08-04 05:38 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పలు పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. ట్రంప్ వర్సెస్ బైడెన్ ఉన్నప్పుడు వాతావరణం ట్రంప్ నకు అనుకూలంగా ఉంటే.. బరిలో నుంచి బైడెన్ తప్పుకొని తన స్థానంలో కమలా హారిస్ ను దింపిన తర్వాత నుంచి సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బైడెన్ బరిలో ఉన్నప్పుడు ట్రంప్ ఏ రీతిలో అయితే దూకుడుగా వ్యవహరించారో.. ఇప్పుడు అలాంటి సీన్ కమలా నుంచి ట్రంప్ నకు ఎదురవుతోంది. తన తీరుకు భిన్నంగా తెగించి పోరాడేందుకు ట్రంప్ ఆసక్తిని చూపట్లేదు.

షెడ్యూల్ ప్రకారం చూస్తే సెప్టెంబరు 10న ఏబీసీ చానల్ లో డిబేట్ జరగాల్సి ఉంది. బైడెన్ బరిలో ఉన్నప్పుడు ఫిక్స్ అయిన డిబేట్. ఇప్పుడు ఆయన స్థానంలో కమలా హారిస్ రంగంలోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ డిబేట్ కు హాజరయ్యే విషయంలో తనకు ఆసక్తి లేదన్న విషయాన్ని ట్రంప్ తేల్చేశారు. తాను ఏబీసీ చానల్ లో డిబేట్ కు రానన్న ట్రంప్ కొత్త వాదనకు తెర తీశారు.

‘నిజానికి జో బైడెన్ తో జరగాల్సిన డిబేట్. ఆయన ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నందున ఆ డిబేట్ కూడా రద్దు అయినట్లే. ఏబీసీ చానల్ లో అయితే రాను. ఫాక్స్ న్యూస్ చానల్ లో అయితే డిబేట్ కు వస్తా. సెప్టెంబరు నాలుగన పెన్సిల్వేనియాలో ఫాక్స్ స్టూడియోలో హారిస్ చర్చకు రావాలి. ఖాళీ స్టూడియోలో కాకుండా కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ డిబేట్ చేద్దాం’’ అంటూ కొత్త మెలికను తనదైన శైలిలో చెప్పుకొచ్చారు ట్రంప్.

ఈ వాదనపై హారిస్ వర్గం మండిపడుతోంది. డిబేట్ కు వచ్చే ధైర్యం ట్రంప్ కు లేదని.. అందుకే ఆయన పారిపోతున్నట్లుగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో హారిస్ తో ఏబీసీ డిబేట్ జరుగుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. ట్రంప్ తో డిబేట్ కు సిద్ధమని కమలా హారిస్ ఇప్పటికే బోలెడన్ని సార్లు చెప్పటం.. అందుకు ప్రతిగా ప్రతి సందర్భంలోనూ ట్రంప్ ఏదో ఒక మాట చెప్పి ఎస్కేప్ కావటం చూస్తున్నదే. తాజా పరిణామాల నేపథ్యంలో కమలా హారిస్ స్పందిస్తూ.. తామిద్దరి గురించి అమెరికన్లకు ఇప్పటికే అంతా తెలుసని పేర్కొన్నారు. ట్రంప్ ను తనతో డిబేట్ కు రావాల్సిందిగా హారిస్ పట్టుబడుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News