మా భర్తలను పోలీసులు కింద కూర్చోబెట్టారు.. హైకోర్టులో మహిళల పిటిషిన్!
పోలీసులు తమ భర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని స్రవంతి యాదవ్ తోపాటు మరో ఇద్దరు మహిళలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
పోలీసులు తమ భర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని స్రవంతి యాదవ్ తోపాటు మరో ఇద్దరు మహిళలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా పోలీసులు విలేకరుల సమావేశం నిర్వహించేటప్పుడు తమ భర్తలను నేలపైన కూర్చోపెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఒక కేసు వివరాలు వెల్లడించడానికి పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారని మహిళలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మారేడుపల్లి పోలీసులు తమ భర్తలను అమానవీయంగా నేలపై కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భర్తలు నేలపై కూర్చోవడం సామాజిక, ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైందని కోర్టుకు నివేదించారు. తమ భర్తలను పోలీసులు వేధింపులకు గురి చేయకుండా ఆదేశాలివ్వాలని విన్నవించారు.
మహిళల పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వి.సంజన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించి వస్తువులను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. వాటిని బాధితులకు వెనక్కి ఇప్పించాలని కోరారు. పోలీసులు బాధితుల చేత తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. వస్తువులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఒక కేసు కూడా నమోదు చేశారన్నారు.
ఈ కేసు ఆధారంగా మరో కిడ్నాప్ కేసు కూడా నమోదు చేశారని కోర్టుకు నివేదించారు. తద్వారా పిటిషనర్ల భర్తలను అరెస్టు చేశారన్నారు. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన క్లయింట్లలో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు.
ఏడేళ్లలోపు శిక్షపడే అవకాశాలున్న కేసులోనూ.. నిందితులుగా మీడియా ముందు ప్రవేశపెట్టి.. వారిని నేలపై కూర్చోబెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ, నార్త్ జోన్ డీసీపీ కుర్చీల్లో కూర్చుని వివరాలు వెల్లడించారన్నారు. కోర్టులు శిక్షలను ఖరారు చేయకముందే పోలీసులు మీడియా ట్రయల్స్ ద్వారా శిక్ష విధించారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వాదనలను విన్న న్యాయమూర్తి నిందితులను వేధింపులకు గురి చేయొద్దని పోలీసులను ఆదేశించారు. పిటిషనర్ల భర్తలను వేధించరాదని, దర్యాప్తు సమయంలో చట్టప్రకారం వ్యవహరించాలని సూచించారు. పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను డిసెంబరు 13కు వాయిదా వేశారు