ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం... ప్రత్యేకతలివే!
ప్రస్తుతం దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. లోక్ సభ ఎన్నికలకు భారత్ సమాయత్తమవుతోంది
ప్రస్తుతం దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. లోక్ సభ ఎన్నికలకు భారత్ సమాయత్తమవుతోంది. మరోపక్క ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి! అందుకే ఈ ఏడాదిని.. ఎన్నికల ఏడాది అని సంభోదిస్తున్నారు! ఈ సమయంలో ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం తాషిగ్యాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. అవేమిటో చూద్దాం...!
ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటూ విలువైనదే. ఒక్క ఓటు విషయంలో కూడా ఎలాంటి పొరపాట్లూ జరగకూడదు.. ఒక్క ఓటును కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమయంలో ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ బూత్ అయిన తాషి గ్యాంగ్ పోలింగ్ కేంద్రం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పోలింగ్ కేంద్రం మరెక్కడలో లేదు.. భారత్ లోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి సుమారు 15,256 అడుగుల ఎత్తులో ఉంది!
అవును... హిమాచల్ ప్రదేశ్ లోని తాషిగ్యాంగ్ పోలింగ్ స్టేషన్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్ ను నిర్మించిన తర్వాత తొలిసారిగా 2019 లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి! అనంతరం... 2021 లో లోక్ సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడోసరి 2024 లోక్ సభ ఎన్నికలకు ఈ పోలింగ్ బూత్ సిద్ధం అవుతుంది!
ఈ పోలింగ్ స్టేషన్ కాజా సబ్ డివిజన్ నుంచి 35 కి.మీ. దూరంలో ఉంది. రహదారి నుంచి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదే... మంచు! ఇక్కడ సుమారు అడుగు మందంలో మంచు కురుస్తోంది. దీంతో... ఎన్నికల సంఘం జూన్ 1 న ఇక్కడ ఓటింగ్ ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో... ఈ సంవత్సరం దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్ గా మార్చింది ఎన్నికల సంఘం.
ఇక ఈ పోలింగ్ కేంద్రంలో 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించ్కోబోతున్నారు. ఈ 52 మందిలోనూ 30 మంది పురుషులు కాగా.. మిగిలిన 22 మంది మహిళా ఓటర్లు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఇక్కడ 45 మంది ఓటర్లే ఉండేవారు. వారులో 27 మంది పురుషులు, 18 మంది మహిళా ఓటర్లు ఉండేవారు! ఇక్కడ గత రెండు సార్లూ 100శాతం పోలింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారు!
కాగా హిమాచల్ ప్రదేశ్ లో 10 వేల నుంచి 12 వేల అడుగుల ఎత్తులో సుమారు 65 పోలింగ్ కేంద్రాలు ఉండగా... 12 వేల అడుగుల ఎత్తులో 20 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక తాషీగంగ్ లోని పోలింగ్ కేంద్రం అయితే ఏకంగా... 15,256 అడుగుల ఎత్తులో ఉండి.. ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రంగా నిలిచింది. ఈ ప్రాంతాలకు పోలింగ్ అధికారులు రెండు రోజుల ముందుగానే చేరుకుంటారు!